ప్రేమికుల రోజున ఘోర విషాదం.. నోయిడాలో కారులో ప్రేమికుల మృతదేహాలు

by Ramesh Naini |

ప్రేమికుల రోజున దేశ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ప్రేమికుల రోజున ఘోర విషాదం.. నోయిడాలో కారులో ప్రేమికుల మృతదేహాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమికుల రోజున దేశ రాజధాని ప్రాంతం (NCR) పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న కక్షతో, ఆమెను కాల్చి చంపి.. ఆపై తాను కూడా కాల్చుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నోయిడా సెక్టార్ 39 పరిధిలో పార్క్ చేసి ఉన్న ఒక కారులో వీరిద్దరి మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన సుమిత్, నోయిడాకు చెందిన రేఖ గత 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, రేఖకు ఇటీవల వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం సెక్టార్ 39 వద్ద పార్క్ చేసి ఉన్న టాటా ఆల్ట్రోజ్ కారులో వీరిద్దరూ తలకు బుల్లెట్ గాయాలతో విగత జీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

ప్రాథమిక విచారణలో వెలుగులోకి!

కారు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. సుమిత్ చేతిలో పిస్టల్ ఉండటాన్ని బట్టి, తొలుత రేఖను కాల్చి చంపిన సుమిత్, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘోరానికి ఒడిగట్టే ముందు.. 'నేను చనిపోతున్నాను' అంటూ సుమిత్ తన ప్రియురాలు రేఖకు వాట్సాప్‌లో మెసేజ్ పంపినట్లు దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ శుక్రవారం నుంచి కనిపించకపోవడంతో, ఆయా కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో సుమిత్ రాసిన ఒక లేఖ లభ్యమైంది. అందులో రేఖ తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి, ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంటోందని పేర్కొన్నట్లు సమాచారం.

దర్యాప్తు ముమ్మరం...

ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించింది. కారులో బుల్లెట్ కేసింగ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇది ముమ్మాటికీ ప్రేమ విఫలమవడంతో జరిగిన హత్య, ఆత్మహత్యేనా? లేక మరేదైనా కోణం ఉందా? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story