భారత రాజకీయాల్లో విషాదం.. మాజీ కేంద్ర మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత

by Kema Shiva Kumar |

మాజీ కేంద్ర మంత్రి, ఆరుసార్లు ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కేపీ ఉన్నికృష్ణన్ ఇవాళ కన్నుమూశారు.

భారత రాజకీయాల్లో విషాదం.. మాజీ కేంద్ర మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేపీ ఉన్నికృష్ణన్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కోజికోడ్‌ (Kozhikode)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అమృత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేరళ రాజకీయ చరిత్రలో ఒకే లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా అత్యధిక కాలం ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా ఉన్నికృష్ణన్‌కు గుర్తింపు పొందారు. 1971 నుంచి 1996 వరకు వరుసగా ఆరుసార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.

సద్దాం హుస్సేన్‌‌తో చర్చలు...

1989-90 కాలంలో వీపీ సింగ్ (VP Singh) ప్రభుత్వంలో కేంద్ర టెలికమ్యూనికేషన్స్, షిప్పింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. గల్ఫ్ యుద్ధ సమయంలో కువైట్‌లో చిక్కుకున్న సుమారు 1.5 లక్షల మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. ప్రాణాలకు తెగించి అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉన్న రహస్య ప్రాంతానికి వెళ్లి చర్చలు జరిపి భారతీయుల తరలింపును విజయవంతం చేశారు.

అయితే, 1936లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించిన ఉన్నికృష్ణన్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ, ఎమర్జెన్సీ తర్వాత సంజయ్ గాంధీతో విభేదాల కారణంగా కాంగ్రెస్ నుండి విడిపోయారు. అనంతరం కాంగ్రెస్ (U), కాంగ్రెస్ (S) పార్టీల్లో పనిచేసి, తిరిగి 1995లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోనే చేరారు. ఉన్నికృష్ణన్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Next Story