తెయ్యం వేడుకల్లో విషాదం.. డాలు దెబ్బ తగిలి కుప్పకూలిపోయిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?

by Ramesh Naini |

కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్ జిల్లా నీలేశ్వర్‌లో జరిగిన ఆలయ ఉత్సవాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది.

తెయ్యం వేడుకల్లో విషాదం.. డాలు దెబ్బ తగిలి కుప్పకూలిపోయిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Kerala) కేరళ రాష్ట్రం కాసర్‌గోడ్ జిల్లా నీలేశ్వర్‌లో జరిగిన ఆలయ ఉత్సవాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పల్లిక్కర సమీపంలోని విష్ణుమూర్తి ఆలయంలో నిర్వహించిన తెయ్యం ఉత్సవాల్లో భాగంగా ఓ యువకుడు ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయాడు. శనివారం రాత్రి పూమారుతన్ దేవుడి ‘తట్టు-వెల్లట్టం’ తెయ్యం ప్రదర్శన జరుగుతుండగా, సంప్రదాయంలో భాగంగా తెయ్యం కళాకారుడు చేతిలో పట్టుకున్న చెక్క డాలు అనుకోకుండా యువకుడి తలకు బలంగా తగిలింది. దీంతో మను అనే యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఘటనను గమనించిన భక్తులు వెంటనే ప్రదర్శనను నిలిపివేసి యువకుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం హుటాహుటిన అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

తెయ్యం సంప్రదాయంలో కళాకారుడు ఒక చేతిలో కత్తి, మరో చేతిలో చెక్క డాలు పట్టుకుని లయబద్ధంగా వేగవంతమైన కదలికలతో ప్రదర్శన ఇస్తుంటారు. ఈ క్రమంలో ఆలయానికి సంబంధించిన సహాయకులు (వల్యకర్లు) లేదా సమీపంలో ఉన్న భక్తులకు స్వల్పంగా డాలు తాకడం సంప్రదాయంలో భాగమేనని స్థానికులు తెలిపారు. అయితే, తాజా ఘటనలో యువకుడి తలకు తీవ్రంగా తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలయ ఉత్సవాల్లో భద్రతా ఏర్పాట్లపై చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదే..

Next Story