Trade deal: భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌.. మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు !

by B.Srinivas |

భారత్ అమెరికాల ట్రేడ్ డీల్ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు గతంలో అనేక మార్లు చర్చలు జరిపారు.

Trade deal: భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌.. మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు !
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ అమెరికాల ట్రేడ్ డీల్ (Trade deal) తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు గతంలో అనేక మార్లు చర్చలు జరిపాయి. అయితే అగ్రిమెంట్‌పై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ట్రేడ్ డీల్ పై మరోసారి చర్చలు జరిపేందుకు భారత ప్రతినిధి బృందం వచ్చే వారం యూఎస్ కు వెళ్లనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ప్రధానంగా వ్యవసాయంపై జరనున్నట్టు వెల్లడించాయి. అనంతరం వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు అంగీకరించే చాన్స్ ఉన్నట్టు సమాచారం. భారత చర్చల బృందానికి చీఫ్ నెగోషియేటర్, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందం ఇప్పటికే మూడుసార్లు వాషింగ్టన్‌కు ప్రయాణించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి పర్యటించనుండటంతో ఉత్కంఠ నెలకొంది. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యంపై ఈ టూర్‌ను ఎంతో కీలకంగా భావిస్తున్నారు.

తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం: అగర్వాల్

అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి అగర్వాల్ చెప్పారు. ఈ ఒప్పందం మొదటి దశ సెప్టెంబర్-అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి ముందు రెండు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిలీ, పెరూతో సహా లాటిన్ అమెరికన్ దేశాలతోనూ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నామన్నారు.

ఆ ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరించేనా?

అమెరికా భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి చాలా దగ్గరగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తెలిపారు. అయితే అమెరికా నుండి వస్తువులకు తమ మార్కెట్లను తెరవాలని భారత ప్రతినిధులు ప్రతిపాదించారు. కానీ యూఎస్ అంగీకరించిన దానిలో పాడి, వ్యవసాయం వంటి కొన్ని రంగాలు లేవు. అయితే తాజా చర్చల్లోనైనా భారత ప్రతిపాదనకు ట్రంప్ అంగీకరిస్తారా లేదా అనే దానికి సందిగ్ధత నెలకొంది. ఈ రంగాలకు బదులుగా దుస్తులు, పాదరక్షల వంటి రంగాలపై అమెరికా పన్నులను తగ్గిస్తుందని భావిస్తున్నారు.

Next Story