కుండపోత వర్షాలు.. రెండు రోజుల పాటు చార్ ధామ్ యాత్ర నిలిపివేత

by Malleboina Mahesh |

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు.

కుండపోత వర్షాలు.. రెండు రోజుల పాటు చార్ ధామ్ యాత్ర నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతికూల వాతావరణం కారణంగా వారం రోజుల పాటు నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra).. ఇటీవలే తిరిగి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం నేపథ్యంలో మరోసారి చార్ ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. ఓ వైపు కుండపోత వర్షాలు కురుస్తుండటం, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు రెండు రోజుల పాటు (మంగళవారం, బుధవారం) తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో యాత్రా మార్గాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు దిగ్బంధమయ్యాయి. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ వెల్లడించారు.

భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను తీవ్రతరం చేసింది. ప్రస్తుతం యాత్రలో ఉన్న భక్తులను సురక్షిత ప్రాంతాలు, బేస్ క్యాంపుల్లోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, యాత్రా మార్గాలు ప్రయాణానికి సురక్షితమని ధ్రువీకరించిన తర్వాతే చార్ ధామ్ యాత్రను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని, నదులు మరియు వాగుల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని స్థానికులతో పాటు పర్యాటకులకు, భక్తులకు పరిపాలన యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

Next Story