Air india Crash: ఎయిర్ఇండియా ఘటనలో పైలట్ల పాత్రపై తీర్మానాలు సరికాదు: మాజీ ఏఏఐబీ చీఫ్

by S Gopi |

తుది నివేదికలో ప్రమాదానికి అత్యంత కీలకమైన కారణం గురించి ప్రస్తావన ఉంటుందని కాబట్టి, అప్పటిదాకా వేచి ఉండాలన్నారు.

Air india Crash: ఎయిర్ఇండియా ఘటనలో పైలట్ల పాత్రపై తీర్మానాలు సరికాదు: మాజీ ఏఏఐబీ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక వచ్చిన నేపథ్యంలో పైలట్ల పాత్రపై అనేక కథనాలు వెలువడుతున్నాయి. అయితే, వారి పాత్రపై ముందస్తు తీర్మానాలు చేయడం అనేది తొందరపడినట్టు అవుతుందని ఏఏఐబీ మాజీ చీఫ్ అరబిందో హండా ఆదివారం అన్నారు. తుది నివేదికలో ప్రమాదానికి అత్యంత కీలకమైన కారణం గురించి ప్రస్తావన ఉంటుందని కాబట్టి, అప్పటిదాకా వేచి ఉండాలన్నారు. 260 మంది మృతి చెందిన ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ అంశం చర్చలో ఉంది. దీంతో ఏఏఐబీ దర్యాప్తును న్యాయంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి మనం వెసులుబాటు కల్పించాలని ఆయన అన్నారు. అరబిందో హండా 100 కంటే ఎక్కువ విమాన ప్రమాదాలను దర్యాప్తు చేశారు. అందులో 2020లో జరిగిన కోజికోడ్‌లోని ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదం కూడా ఉంది. ఏఏఐబీ రానున్న రోజుల్లో దీనిపై మరింత లోతుగా సమాచారం సేకరిస్తుందని, ఇంధన స్విచ్‌లు ఎందుకు, ఎలా మారాయనే దానిపై పరిశీలిస్తారని చెప్పారు. ఏవైనా యాంత్రిక లేదా విద్యుత్ వైఫల్యం జరిగి ఉందా అనేది తెలియాలి. ప్రాథమిక నివేదికపై ఆధారపడి నిర్ధారణకు రావడం సరి కాదని అరబిందో పేర్కొన్నారు.

Next Story