హనీమూన్‌ హత్య కేసు: నేటి తరానికి ఓపిక తక్కువ.. క్షణికావేశాలే ఎక్కువ! సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

హనీమూన్‌ హత్య కేసు నిందితురాలు సోనమ్‌ రఘువంశీ బెయిల్‌ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

హనీమూన్‌ హత్య కేసు: నేటి తరానికి ఓపిక తక్కువ.. క్షణికావేశాలే ఎక్కువ! సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హనీమూన్‌ హత్య కేసు నిందితురాలు సోనమ్‌ రఘువంశీ బెయిల్‌ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరం వాళ్లు సమస్యలకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని, బంధాల పట్ల ఓపిక నశించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడం, పెరిగిపోతున్న భౌతికవాదం (Materialism) వల్ల ఎదురవుతున్న పరిణామాలపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం

మేఘాలయలో 2025 మే నెలలో జరిగిన భర్త ‘రాజా రఘువంశీ’ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆయన భార్య సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఇవాళ (గురువారం) సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమె మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. అరెస్టుకు గల కారణాలను నిందితురాలికి సరిగ్గా వివరించలేదనే (అరెస్ట్ మెమోలో సెక్షన్ల నమోదులో తప్పు) సాంకేతిక కారణంతో గతంలో ఆమెకు బెయిల్ మంజూరైంది. అయితే, దర్యాప్తు సంస్థల పొరపాటు కారణంగా నిందితులకు శాశ్వత రక్షణ లభించదని జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలెలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే విచారణ ప్రారంభమై, అభియోగాలు కూడా నమోదైనందున ఆమె బెయిల్ పై బయట ఉండటం సరికాదని కోర్టు పేర్కొంది.

నేటి తరం తీరుపై న్యాయమూర్తుల ఆవేదన

తీర్పు అనంతరం మారుతున్న సమాజం, నేటి యువత తీరుపై జస్టిస్ సుందరేశ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ప్రస్తుత తరానికి జ్ఞానం ఎక్కువే ఉండొచ్చు, కానీ ఒత్తిడిని జయించే అనుభవం లేదు. నేటి యువతకు ఓపిక తక్కువ, దేనికైనా వెంటనే పరిష్కారం కావాలి. ఇవాళ పెళ్లి చేసుకుంటారు.. రేపే విడిపోవాలనుకుంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి కుటుంబాల్లో పెరిగే పిల్లలు తాతయ్య, నాయనమ్మ, పిన్ని, బాబాయ్.. ఇలా అందరి వద్ద ఎంతో కొంత నేర్చుకుంటారు. కానీ, ప్రస్తుత చిన్న (Nuclear) కుటుంబాల్లో చిన్న విషయానికే పిల్లలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

తల్లిదండ్రుల స్థానంలో గ్యాడ్జెట్స్..

హోటల్ లాబీలో ఏడుస్తున్న ఓ పిల్లాడికి తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చి సముదాయించడాన్ని తాను చూశానని, తల్లిదండ్రుల స్థానాన్ని గ్యాడ్జెట్స్ భర్తీ చేయలేవని జస్టిస్ సుందరేశ్ అభిప్రాయపడ్డారు. వాట్సాప్ లో ఫార్వార్డ్ అయ్యే ప్రతి సమాచారాన్ని నేటి తరం నిజమైన ‘జ్ఞానం’గా భావిస్తోందని జస్టిస్ వరాలె వ్యాఖ్యానించారు.

హనీమూన్‌కు బాడీగార్డ్స్..

ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. భార్యతో హనీమూన్ కు వెళ్లేటప్పుడు బాడీగార్డ్స్ ను కూడా వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ ను కోర్టు దృష్టికి తీసుకురాగా కోర్టు హాల్లో నవ్వులు విరిశాయి. భార్యాభర్తల మధ్య నమ్మకం సన్నగిల్లిందని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడం, సహనం లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలని ఆయన అన్నారు. అలాగే ప్రస్తుత కమెడియన్లు నవ్వించడానికి చౌకబారు, అసభ్యతను ఆశ్రయిస్తున్నారని మెహతా విమర్శించారు. సంతోషం అనేది వస్తువుల వ్యామోహం (Materialism)లో కాదని, పంచుకుంటేనే వస్తుందని నేటి తరం త్వరలోనే గ్రహిస్తుందని ఆశిస్తున్నట్లు జస్టిస్ సుందరేశ్ పేర్కొంటూ విచారణను ముగించారు.

Next Story