నీట్‌-యూజీ 2026కు భారీ భద్రత.. ఈనెల 21 వరకు లాక్‌డౌన్‌లో సబ్జెక్ట్ నిపుణులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-08 04:19:47  IST  )

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

నీట్‌-యూజీ 2026కు భారీ భద్రత.. ఈనెల 21 వరకు లాక్‌డౌన్‌లో సబ్జెక్ట్ నిపుణులు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ యూజీ (NEET UG) పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అత్యంత కఠినమైన చర్యలకు పూనుకుంది. జూన్ 21న జరగబోయే నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశ్నాపత్రాల భద్రత విషయంలో ఎలాంటి లోపాలు తలెత్తకూడదని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే పరీక్ష కోసం క్వశ్చన్ పేపర్లు తయారు చేసే సబ్జెక్ట్ నిపుణులను పరీక్ష ముగిసే వరకు అంటే జూన్ 21 వరకు పూర్తి లాక్‌డౌన్‌లో ఉంచాలని నిర్ణయించింది. అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌టీఏ ఈ కఠినమైన రహస్య ప్రోటోకాల్‌ను అమలు చేస్తోంది. పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న నిపుణుల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్లు సహా అన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాలను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. జూన్ 21న పరీక్ష ప్రారంభమై విద్యార్థులు ఎగ్జామ్ హాల్స్ నుంచి బయటకు వచ్చే వరకు ఈ నిపుణులను ఎన్‌టీఏ ఏర్పాటు చేసిన రహస్య కమాండ్ సెంటర్ ప్రాంతం నుంచి బయటకు రావడానికి అనుమతించరు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా వీరికి వీలుండదు.

పకడ్బందీగా నిఘా.. సీక్రెట్ కోడ్‌లు

ప్రశ్నాపత్రాలు సిద్ధమైన తర్వాత అవి ప్రింట్ చేసే సీక్రెట్ ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందిని సైతం కట్టడి చేశారు. క్వశ్చన్ పేపర్ల ట్రాన్స్‌పోర్టు, వాటిని పరీక్షా కేంద్రాల స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చే ప్రక్రియను కూడా అత్యంత సరికొత్త టెక్నాలజీ, సీక్రెట్ కోడ్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జీపీఎస్ ఆధారిత వాహనాల్లో కఠిన భద్రత మధ్య ఈ పేపర్లను తరలించనున్నారు.

Next Story