త్రిస్సూర్ బాణాసంచా దుర్ఘటన.. రాష్ట్ర స్థాయి విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం

by Malleboina Mahesh |

త్రిస్సూర్ బాణాసంచా పేలుడును కేరళ ప్రభుత్వం ప్రత్యేక విపత్తుగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల పరిహారంతో పాటు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది.

త్రిస్సూర్ బాణాసంచా దుర్ఘటన.. రాష్ట్ర స్థాయి విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళం రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా ముందతికోడ్‌లో జరిగిన భయంకరమైన బాణాసంచా నిల్వ పేలుడు ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పదుల సంఖ్యలో గాయాలపాలు అయ్యారు. ఈ విషాద ఘటనను కేరళ కేబినెట్ 'ప్రత్యేక రాష్ట్ర స్థాయి విపత్తు' (State-specific disaster) గా ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక ఆన్‌లైన్ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ కోసం జస్టిస్ సి.ఎన్. రామచంద్రన్ నాయర్‌తో కూడిన ఏకసభ్య కమిషన్‌ ద్వారా జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

సహాయక చర్యలు, పరిహారం

ఈ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం రూ.14 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందనుంది. ఇందులో రూ.4 లక్షలు SDRF నుంచి, మిగిలిన రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMDRF) నుండి అందజేస్తారు. అలాగే గాయపడిన వారికి విపత్తు సహాయ నిధి కింద అర్హత ఉన్న మొత్తంతో పాటు, అదనంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. అలాగే, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఆరు నెలల పాటు అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. పేలుడు ధాటికి దెబ్బతిన్న సమీపంలోని ఇళ్ల నష్టాన్ని అంచనా వేసి, త్వరితగతిన పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ పేలుడులో ఇప్పటివరకు సుమారు 14 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. రాబోయే 'త్రిస్సూర్ పూరం' పండుగ కోసం బాణాసంచా సిద్ధం చేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Next Story