PM Modi: పరివార్ కా సాథ్, పరివర్ కా వికాస్ మంత్రం- ప్రతిపక్షాలపై మోడీ విమర్శలు

by Shamantha N |

వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు.

PM Modi: పరివార్ కా సాథ్, పరివర్ కా వికాస్ మంత్రం- ప్రతిపక్షాలపై మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీలు అధికార కాంక్షతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నాయని విమర్శించారు. కానీ తమ పార్టీ మాత్రం సమ్మిళిత అభివృద్ధి ఇతివృత్తంగా పనిచేస్తుందన్నారు. దేశానికి సేవ చేయడంలో తమ మార్గదర్శక మంత్రం ఎల్లప్పుడూ 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్'(అందరితో కలిసి.. అందరికోసం..) అని అన్నారు. ఈ స్ఫూర్తితో, ప్రతి పౌరుడి శ్రేయస్సు కోసం ముందుకు సాగుతూనే ఉంటామన్నారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం దీనికి విరుద్ధంగా ‘పరివార్ కా సాథ్ పరివార్ కా వికాస్’ (కుటుంబంతో కలిసి.. కుటుంబం కోసం) అనే విధానాన్ని అనుసరిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని తాము మహిళల విద్య, అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు.

కాశీ ఆరోగ్యరాజధానిగా..

కాగా.. గతంలో పూర్వాంచల్‌లో ఆరోగ్య సౌకర్యాలు తక్కువగా ఉండేవని కానీ, ఇప్పుడు,కాశీ పూర్వాంచల్‌కు ఆరోగ్య రాజధానిగా మారుతోందని ప్రధాని అన్నారు. భారత్‌ అభివృద్ధి, వారసత్వం అనే రెండింటితో ముందుకువెళ్తోందని పేర్కొన్నారు. 2036లో ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని.. అందుకు అనుమతి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వారణాసిలో ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కూడా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశామని మోడీ అన్నారు. వాటిలో 130 తాగునీటి ప్రాజెక్టులు, నాలుగు గ్రామీణ రోడ్లు, 100 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని ప్రధాని తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన కాశీ ఎప్పటికీ తనదేనని.. తాను కాశీకి చెందినవాడినని మోడీ పేర్కొన్నారు. అంతేకాకుండా, 70 ఏళ్లు దాటిన ముగ్గురు లబ్ధిదారులకు ఆయష్మాన్ కార్డులను అందజేశారు. మరోవైపు, వారణాసి మోడీ సొంత నియోజకవర్గం. 2014 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు అక్కడి నుంచి విజయం సాధించారు.

Next Story