- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ అసెంబ్లీ స్పీకర్‌గా తిరువంచూర్ రాధాకృష్ణన్ ఎన్నిక.. మాజీ హోం మంత్రికి దక్కిన గౌరవం
కేరళ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి తిరువాంచూర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: కేరళ శాసనసభ 16వ నూతన స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యూడీఎఫ్ (UDF) కూటమి అభ్యర్థి తిరువాంచూర్ రాధాకృష్ణన్ (Thiruvanchoor Radhakrishnan) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమి ఘనవిజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్పీకర్ స్థానానికి రాధాకృష్ణన్ పేరును కూటమి ఖరారు చేసింది. సభ్యులందరి మద్దతుతో ఆయన శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, మంత్రులు, విపక్ష నేతలు ఆయనను గౌరవపూర్వకంగా స్పీకర్ స్థానానికి తీసుకువెళ్లి కూర్చోబెట్టారు.
కొట్టాయం శాసనసభ నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువాంచూర్ రాధాకృష్ణన్‌కు కేరళ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్, సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో దివంగత సీఎం ఉమ్మన్ చాందీ (Oommen Chandy) నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో ఆయన హోంశాఖ, రెవెన్యూ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ సంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. సభలోని అధికార, ప్రతిపక్ష సభ్యులందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ.. సభా కాలాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని తిరువాంచూర్ రాధాకృష్ణన్ తెలిపారు.






