పెళ్లి పందిట్లో భారీ చోరీ : అతిథిలా వచ్చాడు.. రూ. 4 లక్షలతో ఉడాయించాడు

by Ramesh Naini |   (  Updated:2026-02-14 17:04:48  IST  )

బంధుమిత్రుల కోలాహలం నడుమ దర్జాగా వచ్చిన ఓ దొంగ.. ఏకంగా పెళ్లి కూతురు పక్కనే ఉన్న రూ. 4 లక్షల విలువైన బ్యాగును ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి పెళ్లి వీడియో కెమెరాల్లో రికార్డయ్యాయి.

పెళ్లి పందిట్లో భారీ చోరీ : అతిథిలా వచ్చాడు.. రూ. 4 లక్షలతో ఉడాయించాడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో భారీ చోరీ కలకలం రేపింది. బంధుమిత్రుల కోలాహలం నడుమ దర్జాగా వచ్చిన ఓ దొంగ.. ఏకంగా పెళ్లి కూతురు పక్కనే ఉన్న రూ. 4 లక్షల విలువైన బ్యాగును ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి పెళ్లి వీడియో కెమెరాల్లో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని జగత్‌పురా ప్రాంతంలో ఉన్న ‘చందన్ వన్’ వేదికగా ఫిబ్రవరి 7న ఓ వివాహం ఘనంగా జరిగింది. వేదికపై నూతన దంపతులు బంధువుల ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి సందడిలో ఉండగా, ఖరీదైన సూటు ధరించిన ఓ యువకుడు అతిథిలా వేదికపైకి వచ్చాడు.

ఎవరికీ అనుమానం రాకుండా...

ఎవరికీ అనుమానం రాకుండా వధూవరుల వెనుక వైపుగా వెళ్లిన ఆ దుండగుడు.. వధువు పక్కనే ఉన్న బ్యాగును అత్యంత చాకచక్యంగా కొట్టేశాడు. వెంటనే ఆ బ్యాగును తన బ్లేజర్ (కోటు) లోపల దాచుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. చోరీకి గురైన బ్యాగులో సుమారు రూ. 4 లక్షల నగదుతో పాటు, విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితులు వాపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.

Next Story