మా వాళ్లను నిరాయుధులను చేసి హతమార్చారు.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కీలక లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-04 06:22:49  IST  )

‘ఆపరేషన్ కగార్‌’లో భాగంగా ఇటీవల మారెడుమిల్లి, రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్లపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) వికల్ప్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది.

మా వాళ్లను నిరాయుధులను చేసి హతమార్చారు.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కీలక లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ కగార్‌’లో భాగంగా ఇటీవల మారెడుమిల్లి, రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్లపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) వికల్ప్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. అయితే, ఆ లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, మరో ఐదుగురు, ఏవోబీ ఎస్‌జడ్‌సీ సభ్యుడు కామ్రేడ్ శంకర్‌లవి ముమ్మాటికీ హత్యలేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులవి పక్కా బూటకపు ఎన్‌కౌంటర్లని, మా వాళ్లను నిరాయుధులుగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చారని ఫైర్ అయ్యారు.

చికిత్స కోసం వస్తే.. చంపేశారు

కామ్రేడ్ హిడ్మా నవంబర్ 15న చికిత్స నిమిత్తం విజయవాడకు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి, మూడు రోజుల చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. అనంతరం నవంబర్ 18న ఆయనను, అనుచరులను ఎవరి కంటా పడకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చారని ధ్వజమెత్తారు. అదేవిధంగా నవంబర్ 19న రంపచోడవరం మండలంలో కామ్రేడ్ శంకర్‌తో సహా మరో 6 మందిని హతమార్చారు. మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారు, 50 మందిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. అయితే, అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి లేరు. అందుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే. హిడ్మా కదలికలను ఇది వరకే సరెండర్ అయిన పార్టీ సభ్యుడు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని లేఖలో ప్రస్తావించారు. అనంతరం విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్చ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ కాంట్రాక్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ ఆపరేషన్ అని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూత్రధారి అని విమర్శించారు.

దేవ్‌‌ జీపై నీలాపనిందలు..

కామ్రేడ్ హిడ్మా హత్యకు కారణం మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం, సోని సోడీలు చేసిన ఆరోపణలపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్ర స్థాయిలో మండపడింది. దేవ్‌ జీ పోలీసులతో ఒప్పందం చేసుకుని మావోయిస్టుల సభ్యుల సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడనేది పూర్తిగా అబద్ధమని, పోరాట వీరుడిపై నీలాపనిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మావోయిస్టు పార్టీపై కుట్రలో ఓ భాగమననే తెలిపారు. మనీష్ కుంజాం బస్తర్‌లో ఆదివాసుల నర సంహారాన్ని సమర్థించారని విమర్శించారు.

విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలి..

భారతదేశాన్ని ‘కార్పొరేట్ హిందూ దేశం’గా మార్చాలని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వాలు ‘కాగర్’ యుద్ధం సాగిస్తున్నాయని అని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో లేఖలో పేర్కొంది. మావోయిస్టు నాయకులను పూర్తిగా నిర్మూలించడమే వారి లక్ష్యమని ఆరోపించింది. బస్తర్‌లో ఆదివాసులపై నరసంహారం జరుగుతోందని, ఇటీవలి ఘటనల్లో పలువురు గ్రామస్థులు కూడా హతమయ్యారని పేర్కొన్నారు. ఆ హత్యలపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ‘ఆపరేషన్ కగార్‌’‌ను వెంటనే ఆపాలని.. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అరెస్ట్ అయిన 50 మంది మావోయిస్టులకు న్యాయ సాయం అందించాలని, వారి విడుదలకు కృషి చేయాలని ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అబద్ధ ప్రచారాలకు లొంగకుండా విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖలో పేర్కొంది.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ రాసిన లేఖ.. https://epaper.dishadaily.com/4089897/Dishaweb/04-12-2025#page/1/1

Next Story