E-20 పెట్రోల్ ఇంకా ప్రయోగదశలోనే.. సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ

by Prasad Jukanti |

దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

E-20  పెట్రోల్ ఇంకా ప్రయోగదశలోనే.. సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ (E20) పై పెద్ద ఎత్తున విమర్శలు, చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం వాదన చర్చనీయాంశంగా మారింది. దేశంలో పెట్రోల్‍లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేసే ప్రక్రియ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని దీని ప్రభావం ఏంటనే ఫలితాలు వచ్చే ఏడాది నాటికి స్పష్టం అవుతాయని మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సవాల్ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం ఈ వాదన చేయడం గమనార్హం.

ఈ20 పాలసీకి విఘాతం కలుగుతుందని..

తమ వద్ద నుంచి ఇథనాల్ కొనుగోళ్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ డిస్టలరీ కంపెనీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. 2025-26 సరఫరా సంవత్సరానికి గాను ఇథనాల్ కేటాయింపులను పెంచాలని కోరిన ఒక డిస్టిలరీ అభ్యర్థనను పరిశీలించాలని గత జూన్ 23న కర్ణాటక హైకోర్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీనిపై బీపీసీఎల్ స్పందిస్తూ.. ఇలాంటి ఉత్తర్వుల వల్ల దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి దీనిపై స్పందిస్తూ ఇథనాల్ సరఫరా ఒప్పందాలు అక్టోబర్ 2025లోనే ఖరారయ్యాయని ఇలాంటి పిటిషన్లు పలు హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ డివిజన్ బెంచ్ కు వెళితే ఇతర హైకోర్టుల నుంచి ఇదే తరహా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని దీని వల్ల ఈ20 పాలసీకి విఘాతం కలిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Next Story