ఎన్నికల తర్వాత.. ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటాము: కాంగ్రెస్

by Disha Web Desk 12 |
ఎన్నికల తర్వాత.. ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటాము: కాంగ్రెస్
X

బెంగళూరు : రాబోయే ఎన్నిక‌ల్లో కేర‌ళ‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేద‌ని రాహుల్ గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్ప‌ష్టం చేశారు.అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. సైద్ధాంతిక విభేదాలు, రాజకీయ వైరుధ్యాలను పక్కకు పెట్టి .. రీజియనల్ పార్టీలతో కలిసి నడుస్తామన్నారు.

ప్రత్యేకించి కేరళలో సీపీఐ (ఎం) తో.. తెలంగాణలో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల తర్వాత పొత్తులు కుదిరే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. కొన్ని సందర్భాల్లో.. కొన్ని చోట్ల ఎన్నికలకు ముందే పొత్తులు కుదుర్చుకోవాల్సి కూడా రావచ్చన్నారు. క‌ర్ణాట‌క‌లో భారీ మెజారిటీ రావ‌డంతో త‌మ పార్టీ స‌త్తా ఏమిటో బ‌య‌ట ప‌డిందని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ప్రస్తుతం క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఎవ‌రైనా స‌రే పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటార‌ని తెలిపారు.

మ‌ల్లికార్జున ఖ‌ర్గే .. క‌ర్ణాట‌క సీఎం కాలేర‌ని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. అలాంటి వదంతులను నమ్మొద్దన్నారు. సిద్ద‌రామ‌య్య, డీకే శివ‌కుమార్ ల‌లో ఎవ‌రో ఒక‌రు సీఎం అవుతార‌ని చెప్పారు. కర్ణాటక ఎన్నిక‌ల ఫ‌లితాలతో .. రాజ‌స్థాన్ లో పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు తొలగిపోయే ఆస్కారం ఉంటుంద‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పారు. భారత్ జోడో యాత్ర ఫలితాన్ని తాము కర్ణాటక పోల్స్‌లో చూశామని కామెంట్ చేశారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో తూర్పు నుండి పడమరకు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను త్వరలో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

Also Read..

సీఎం అభ్యర్థి ప్రకటన వేళ డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Next Story