ప్రేమించిన అమ్మాయి కోసం లైఫ్ రిస్క్ చేసిన ప్రియుడు.. చివరకు ఏమైందంటే?

by Prasad Jukanti |   (  Updated:2025-11-13 11:30:37  IST  )

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కలలు కన్న ఓ ప్రేమికుడి జీవితం విషాదంగా ముగిసింది.

ప్రేమించిన అమ్మాయి కోసం లైఫ్ రిస్క్ చేసిన ప్రియుడు.. చివరకు ఏమైందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమించిన యువతిని దక్కించుకునేందుకు యువకులు ఎన్నో రకాల ఫీట్లు వేస్తుంటారు. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలే చేస్తారు. తాజాగా ప్రేమించిన అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులను మెప్పించడం కోసం తన లైఫ్ రిస్క్ చేసిన యువకుడి జీవితం చివరకు విషాదంగా మారింది. చైనాలో జరిగిన ఈ విషాద ప్రేమ గాథ ఇప్పుడు వైరల్ అవుతోంది. హెనాన్ ప్రావిన్స్ కు (Henan Province) చెందిన ఓ 36 ఏళ్ల వ్యక్తి ఓ యువతితో ప్రేమలలో పడ్డాడు. అయితే సదరు వ్యక్తి ఊబకాయం కారణంగా 134 కిలోల బరువు ఉన్నాడు. ఇవేవి లెక్కపెట్టని ఆ మహిళ తన ప్రియుడితో పెళ్లికి సిద్ధమైంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తన ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అని మెప్పించేందుకు సదరు వ్యక్తి చేసిన రిస్క్ బెడిసి కొట్టింది.

త్వరగా బరువు తగ్గడానికి అతడు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ (Gastric Bypass Surgery) చేసించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత సెప్టెంబర్ 30న జెంగ్ జౌలోని తొమ్మిదవ పీపుల్స్ హాస్పిటల్ లో చేరాడు. ఆ తర్వాత అక్టోబర్ 2న ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో అక్టోబర్ 3న అతడిని జనరల్ వార్డుకు తరలించారు. అంతా బాగానే జరిగింది అనుకునే లోపు దురదృష్టవాశాత్తు అక్టోబర్ 4న అతని ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం అతను శ్వాసతీసుకోవడం ఆపేశాడు. అత్యవసర చికిత్స అందిస్తున్నప్పటికీ శ్వాసకోశ వైఫల్యం కారణంగా అతడు అక్టోబర్ 5న లీ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఈ రకమైన శస్త్రచికిత్సలో ఎప్పుడు డెత్ రిస్క్ ఉంటుందని ఆపరేషన్ల ద్వారా బరుగు తగ్గడం కంటే సహజమైన పద్ధతిలో బరువు తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలని కొందరు కామెంట్స్ చేస్తుంటే, తన ప్రేమను దక్కించుకునే క్రమంలో అతడు తన ప్రాణాలే కోల్పోయాడని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story