హార్ముజ్ ఉద్రిక్తతలు.. పశ్చిమాసియా జలాల్లోకి తిరిగొచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక

by Ramesh Naini |

అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్‌ఎస్‌ జెరాల్డ్ ఆర్‌.ఫోర్డ్‌’ మరమ్మతుల అనంతరం తిరిగి పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించింది.

హార్ముజ్ ఉద్రిక్తతలు.. పశ్చిమాసియా జలాల్లోకి తిరిగొచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్‌ఎస్‌ జెరాల్డ్ ఆర్‌.ఫోర్డ్‌’ (USS Gerald R. Ford) మరమ్మతుల అనంతరం తిరిగి పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించింది. రెండు డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు (యూఎస్‌ఎస్‌ మహాన్, విన్‌స్టన్ ఎస్. చర్చిల్) తోడురాగా.. సూయజ్ కాలువను దాటి ఎర్ర సముద్రంలోకి చేరుకుందని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. ఈ మోహరింపుతో గత 50 ఏళ్ల అమెరికా నావికాదళ చరిత్రలో అత్యధిక కాలం (వరుసగా 295 రోజులు) సముద్రంలో గడిపిన విమాన వాహక నౌకగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. కోవిడ్ సమయంలో (2020) ‘యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్’ నెలకొల్పిన 294 రోజుల రికార్డును తాజాగా ఇది అధిగమించింది.

కీలక ఆపరేషన్లలో భాగస్వామ్యం

జూన్ 2025 లో బయలుదేరిన ఈ నౌక.. కరేబియన్ దీవుల్లో వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునే భారీ ఆపరేషన్‌లో పాల్గొంది. ఆ తర్వాత ఇరాన్ యుద్ధం ప్రారంభ రోజుల్లోనూ సేవలందించింది. అయితే, నౌకలోని లాండ్రీ గదిలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా తూర్పు మధ్యధరా సముద్రంలో కొద్దిరోజులు మరమ్మతులకు గురై తిరిగి విధుల్లోకి వచ్చింది. ఇప్పటికే అరేబియా సముద్రంలో మోహరించిన ‘అబ్రహం లింకన్’కు ఫోర్డ్ తోడు కానుంది. దీనికి తోడు ముచ్చటగా మూడో నౌక ‘యూఎస్‌ఎస్‌ జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్’ కూడా దక్షిణాఫ్రికా మీదుగా ఇదే ప్రాంతానికి వస్తోంది.

ఇరాన్ హెచ్చరికలు

హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, అమెరికా నౌకల మోహరింపుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్రంగా స్పందించారు. శత్రువులకు ఓటమి రుచి చూపించడానికి తమ నౌకాదళం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సుదీర్ఘ మోహరింపుపై అమెరికా చట్టసభ సభ్యులు మండిపడుతున్నారు. లాండ్రీ అగ్నిప్రమాదం వల్ల 600 మంది నావికులు పడుకోవడానికి చోటులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దళాలను అధ్యక్షుడు తన సొంత కాపలాదారుల్లా వాడుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాలు సిబ్బంది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని సెనేటర్ టిమ్ కైన్ విమర్శించారు. దాదాపు 11 నెలల పాటు సాగే ఈ రికార్డు స్థాయి మోహరింపును ముగించుకుని, మే నెలాఖరులో ఈ విమాన వాహక నౌక స్వదేశానికి (అమెరికా) చేరుకునే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story