IND-PAK: ఆపరేషన్ సిందూర్ కంటే ముందు భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధాలివే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-08 03:41:24  IST  )

భారత్ (Bharat), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొనటం కొత్తేమీ కాదు.

IND-PAK: ఆపరేషన్ సిందూర్ కంటే ముందు భారత్, పాక్ మధ్య జరిగిన యుద్ధాలివే!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ (Bharat), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొనటం కొత్తేమీ కాదు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది 1947లో స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి భారత్‌పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌ను దక్కించుకోవాలని ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా.. భారత్‌ అంటే విషం చిమ్ముతూనే ఉంటుంది. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌పై ఉగ్రమూకలను ఉసిగొల్పుతూనే ఉంది. ఈ ఉగ్రదాడులకు ఎప్పటికప్పుడు భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతూ.. చావు దెబ్బ తీస్తున్నప్పటికీ దాయాది దేశం మాత్రం తన బుద్ధి మార్చుకోవటం లేదు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని (Jammu kashmir) పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులను బలితీసుకుంది. ఇందుకు పత్రీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)' పేరుతో పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ కంటే ముందు గత ఏడు దశాబ్ధాలుగా పాక్‌పై భారత్ చేపట్టిన కీలక ఆపరేషన్ల గురించి తెలుసుకుందాం.

* మొదటి ఇండో-పాక్ యుద్ధం: 1947

స్వాతంత్య్రం పొందిన కొన్ని నెలలకే జమ్మూకశ్మీర్ కోసం భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. దీన్నే 'మొదటి కశ్మీర్ యుద్ధం' అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం 12 నెలల 10 రోజుల పాటు జరిగింది. స్వాతంత్య్రం పొందిన తర్వాత జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో వీలినం చేయాలని అప్పటి కాశ్మీర్ మహారాజు హరి సింగ్ నిర్ణయించుకున్నారు. అయితే, పాక్ మద్దతున్న ట్రైబల్‌ మిలీషియా దళాలు కశ్మీర్‌ను ఆక్రమించాయి. దీంతో ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు భారత్‌ బలగాలను అక్కడికి పంపించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. పాక్ మద్దతు దళాలను భారత్ సైన్యం తరిమికొట్టినప్పటికీ.. అప్పటికే మూడో వంతు కాశ్మీర్‌ను పాకిస్థాన్ ఆక్రమించేసింది. దీన్నే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)గా పిలుస్తున్నాం. ఇక ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఇరు దేశాలు 1949 జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. అప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) ఏర్పాటైంది.

* ఆపరేషన్ రిడిల్: 1965

1965లో భారత్, పాకిస్థాన్ మధ్య రెండోసారి యుద్ధం జరిగింది. కశ్మీర్‌ను పూర్తిగా ఆక్రమించాలనుకునే ఉద్దేశ్యంతో పాక్‌ సైనికులు, తిరుగుబాటుదారులు మారువేషంలో కశ్మీర్‌లోకి చొరబడ్డారు. 'ఆపరేషన్ జిబ్రాల్టర్ అండ్ గ్రాండ్ స్లామ్' పేరుతో జమ్ముకశ్మీర్​ను అస్థిరపరచడం, స్థానిక తిరుగుబాట్లను రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, దీనికి ధీటుగా భారత్ 'ఆపరేషన్ రిడిల్‌'ను చేపట్టడటంతో పాక్ తోకముడిచింది. ఈ యుద్ధం 17 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో కుదిరిన తాష్కెంట్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

* ఆపరేషన్ ట్రైడెంట్: 1971

భారత్, పాక్ మధ్య మూడోసారి 1971లో యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్​కు స్వాతంత్య్రం రావడానికి ఈ యుద్ధమే కారణం. ఈ యుద్ధం 13 రోజుల పాటు జరిగింది. ప్రస్తుత బంగ్లాదేశ్ 1947లో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తూర్పు పాకిస్తాన్‌గా ఉండేది. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోరుతూ పోరాటం చేయటంతో పాక్ సైన్యం బంగ్లాదేశ్‌లో చొరబడి మారణహోమం సృష్టించింది. భారత్ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచి తక్కువ సమయంలోనే తూర్పు పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ సమయంలోనే కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ట్రైడెంట్ ప్రారంభించింది. భారత్‌ నౌకాదళం క్షిపణి బోట్లు.. ఊహించని రీతిలో పాక్‌ నౌకాదళ ఆస్తులు, ఇంధన నిల్వలను ధ్వంసం చేశాయి. ఆ యుద్ధంలో భారత్‌ నౌకాదళం ఆధిపత్యం కనబరచింది. చివరకు బంగ్లాదేశ్‌ ఏర్పాటుతో ఆ యుద్ధం ముగిసింది. అయితే ప్రస్తుతం భారత్ మీదకే బంగ్లాదేశ్ కాలు దువ్వుతుండటం గమనార్హం.

* ఆపరేషన్ మేఘదూత్: 1984

1984లో లద్దాఖ్‌లోని సియాచిన్‌ గ్లేసియర్‌లో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం 'ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌'ను చేపట్టింది. సాల్టోరో రిట్జ్‌పై పైచేయి సాధించిన భారత బలగాలు.. ఆ ప్రాంతంలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేశాయి. అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఆ యుద్ధభూమి భారత్‌కు ఓ వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఇప్పటికీ అక్కడ మన బలగాల గస్తీ ఉంటుంది.

* ఆపరేషన్ విజయ్: 1999

1999లో జమ్ము కాశ్మీర్‌‌లోని కార్గిల్ సెక్టార్​లోని పర్వతాలను పాకిస్థాన్ దళాలు, ఉగ్రవాదులు ఆక్రమించారు. దీంతో భారత్‌ 'ఆపరేషన్‌ విజయ్‌' చేపట్టింది. ఈ యుద్ధాన్ని కార్గిల్ యుద్ధంగా కూడా పిలుస్తారు. ఈ ఆపరేషన్‌లో భారత్ వాయుసేన తోడ్పాటుతో భారత సైన్యం పాకిస్థాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులను తరిమికొట్టింది. భీకరమైన పోరాటం తర్వాత పాక్ స్వాధీనం చేసుకున్న కార్గిల్‌ను భారత్ తిరిగి చేజిక్కించుకుంది. 1999 మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది. అందుకే ప్రతి ఏటా జులై 26ని కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం.

* ఆపరేషన్ అనామక (సర్జికల్ స్ట్రైక్స్): 2016

2016లో జమ్ము కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో ఉన్న భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. ఈ ఉరి దాడికి ధీటుగా స్పందించిన ఇండియన్ ఆర్మీ.. 10 రోజుల తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. ఈ రహస్య ఆపరేషన్‌లో చాలా మంది ఉగ్రవాదులను అంతం చేసింది. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత్ ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించిందని సర్జికల్ స్ట్రైక్స్‌తో ప్రపంచానికి తెలియజేసింది.

* ఆపరేషన్ బందర్: 2019

పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు.. 40 మంది సైనికులను పొట్టనపెట్టుకున్నారు. జైషే మహమ్మద్‌ ఈ దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. దీనికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్ బాలాకోట్​లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై వైమానిక దాడులు చేసింది. ఫైటర్ జెట్​లతో పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేసింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం అదే తొలిసారి.

* ఆపరేషన్‌ సింధూర్‌: 2025

పహల్గామ్‌లో ఏప్రిల్‌ 22న అక్కడి పర్యటకులపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 26 మందిని కాల్చి చంపేశారు. కన్నవారి, కట్టుకున్నవారి కళ్లముందే ప్రాణాలు తీసిన తీరు యావత్‌ ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. దీనికి ప్రతీకారంగా 'ఆపరేషన్‌ సింధూర్‌' చేపట్టిన భారత్‌.. పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కరులను భారత సైన్యం మట్టుపెట్టింది.

Next Story