తమిళనాట విజయ్ ప్రభంజనం.. ఏకంగా 71 స్థానాల్లో అధిక్యం

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-04 04:07:35  IST  )

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా తారుమారు అవుతున్నాయి.

తమిళనాట విజయ్ ప్రభంజనం.. ఏకంగా 71 స్థానాల్లో అధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త పార్టీ సంచలనం సృష్టించే దిశగా సాగుతోంది. ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) తొలి ఎన్నికల్లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఏకంగా 71 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది.

డీఎంకే, టీవీకే మధ్య హోరాహోరీ..

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అధికార డీఎంకే (DMK, టీవీకే (TVK) మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగుతోంది. రెండు పార్టీలు చెరో 71 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే (AIADMK) 30 స్థానాల్లో లీడ్‌లో ఉంది. తమిళనాడు యూత్ విజయ్ వైపు గంపగుత్తగా మొగ్గు చూపడం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. యువ ఓటర్లు కేవలం ఓటు వేయడమే కాకుండా, ఇతర ఓటర్లను కూడా టీవీకే వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు చెబుతున్నారు. అవినీతి రహిత పాలన, మార్పు కోరుకుంటున్న తటస్థ ఓటర్లు కూడా విజయ్ వైపు నిలిచినట్లు స్పష్టమవుతోంది.

మారనున్న పొలిటికల్ సీన్..?

ఒకవేళ ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ స్థానాలు 118 రాని పక్షంలో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏఐడీఎంకే, టీవీకే చేతులు కలిపితే, తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలతో డీఎంకే వర్గాల్లో గుబులు మొదలవ్వగా, విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

Next Story