భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఖరారు.. అధికారిక ముసాయిదా విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-07 03:50:43  IST  )

భారత్ - అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ మేరకు భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం ఇవాళ అధికారిక ముసాయిదాను విడుదల చేసింది.

భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఖరారు.. అధికారిక ముసాయిదా విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - అమెరికా మధ్య ఎట్టకేలకు ట్రేడ్ డీల్ (Trade Deal) కుదిరింది. ఈ మేరకు భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అగ్రదేశం ఇవాళ అధికారిక ముసాయిదా (Official Draft)ను విడుదల చేసింది. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లుగా వైట్‌హౌస్ (White House) ప్రకటించింది. సవరించిన సుంకాలు భారత కాలమానం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందని అమెరికా పేర్కొంది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్‌ను భారత్‌ దిగుమతి చేసుకోనుందని వెల్లడించింది.

ఇక ఆ ఉత్పత్తులపై జీరో సుంకాలు..

అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్‌ (India) అంగీకరించిందని పేర్కొంది. అందులో ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలు ఉన్నాయి. ఇక అమెరికా నుంచి వచ్చే వాటిపై సుంకాలను భారత్ సున్నా శాతానికి తగ్గిస్తుందని కూడా ప్రకటించారు. అందులో పండ్లు, కూరగాయలు, వైన్, ఎర్రజొన్నలు, వాల్‌నట్స్, బాదం వంటి కొన్ని రకాల గింజల ఉత్పత్తులు ఉన్నాయి. అదేవిధంగా డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ (Dried Distillers Grains), పశుగ్రాసం కోసం ఉపయోగించే ఉత్పత్తులపై సుంకాలు సున్నా శాతంగా ఉండనున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ కూడా జీరో పర్సెంటేజీ కిందకు రానున్నాయి. రైతుల ప్రయోజనాల దృష్ట్యా డెయిరీ వంటి సున్నితమైన రంగాలకు భారత్ రక్షణ కల్పించనున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు ప్రకటించాయి. ఇక జెనరిక్ మందులు (Generic medicines), విమాన విడిభాగాలపై పరస్పర సుంకాలు తొలగించుకునేందుకు ఇరు దేశాలు కూడా అగీకారం తెలిపాయి.

ప్రధాని మోడీ స్పెషల్ థాంక్స్

భారత్ - అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు దేశాలకు ఇది నిజంగానే శుభవార్త అని అన్నారు. వ్యక్తిగత నిబద్ధతతో కృషి చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ థాంక్స్ చెప్పారు.

Next Story