- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో ముగిసిన సీఈసీ రాజీవ్‌కుమార్ పదవీకాలం.. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్
ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో (ఫిబ్రవరి 18) ముగియనుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో (ఫిబ్రవరి 18) ముగియనుంది. ఈ సందర్భంగా ఆయనకు తోటి అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజీవ్ కుమార్ 2020 సెప్టెంబరు 1న కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా చేరారు. 2022 మే 15న దేశ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్ (26వ ప్రధాన ఎన్నికల కమిషనర్) CEC నియమితులయ్యారు. ఈ పదవిలో 2029 జనవరి 26 దాకా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉత్తర్వులు జారీ చేశారు.
కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ IAS అధికారి అయిన జ్ఞానేశ్‌కుమార్ గతంలో పలు కీలక శాఖల్లో సేవలందించారు. ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసే బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించిన పత్రాల వ్యవహారాన్ని.. హోం శాఖలో అదనపు కార్యదర్శిగా ఆయనే పర్యవేక్షించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, కేంద్ర సహకార శాఖల కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది జనవరిలో ఆయన రిటైర్ అయ్యారు.
కాగా, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (Appointment, Conditions of Service and Term of Office) చట్టం-2023' పేరుతో రూపొందించిన కొత్త చట్టం ప్రకారం CEC నియామకం ఇదే మొదటిసారి కావడం విశేషం. పాత విధానం ప్రకారం ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండేవారు. అయితే, 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో భారత ప్రధాన న్యాయమూర్తికి బదులు కేంద్ర మంత్రివర్గం నామినేట్ చేసే మంత్రికి స్థానం కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై సుప్రీంలో బుధవారం విచారణ జరగనుంది.






