- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రెండు రాష్ట్రాల్లో ముగిసిన SIR ప్రక్రియ.. ఏకంగా 1.71 కోట్ల ఓట్లు తొలగింపు
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియను వేగంవతం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియను వేగంవతం చేసింది. ఇందులో భాగంగా మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఎంట్రీలు, గైర్హాజరు ఓటర్లు, దేశంలోకి అక్రమంగా చొరబడిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే SIRలో భాగంగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారు. తాజాగా, ఈసీ ఆ రెండు రాష్ట్రాల ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
సీఎం స్టాలిన్ నియోజవర్గంలో లక్ష ఓట్లు తొలగింపు..
తమిళనాడులో 97.37 లక్షల ఓట్ల తొలగించినట్లుగా భారత ఎన్నికల సంఘం తెలిపింది. SIR ముందు అక్కడ మొత్తం 6.41 కోట్ల ఓటర్లు ఉండగా.. ముసాయిదా జాబితాలో 5.43 కోట్లకు తగ్గింది. సుమారు 97.37 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అందులో మరణించిన వారు 26.94 లక్షలు, శాశ్వతంగా వలస వారు, గైర్హాజరైన వారు 66.44 లక్షలు ఉన్నారు. ఇక డూప్లికేట్ ఓట్లు 3.98 లక్షలుగా ఉంది. ఒక్క చెన్నైలోనే 14.25 లక్షల ఓట్లు తొలగించినట్లుగా అధికారులు వెల్లడించారు. సీఎం ఎంకే స్టాలిన్ నియోజకవర్గం కోలత్తూర్‌లోనూ లక్షకు పైగా ఓట్లు గల్లంతయ్యాయని నివేదికలు పేర్కొన్నాయి. రాష్ట్ర సీఈవో ఆర్చనా పట్నాయక్ మాట్లాడుతూ.. ఇది ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే ప్రక్రియ మాత్రమేనని, నిజమైన ఓటర్లు తిరిగి చేర్చుకోవచ్చని తెలిపారు.
గుజరాత్‌లో 73.73 లక్షల ఓట్ల కోత..
ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా గుజరాత్‌లో ముందు 5.08 కోట్ల ఓటర్లు ఉండగా, ముసాయిదా జాబితాలో 4.34 కోట్లకు తగ్గింది. ఏకంగా 73.73 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అందులో మరణించిన వారు 18.07 లక్షలు ఉండగా.. శాశ్వతం వలస వెళ్లిన, గైర్హాజరై వారు 40.25 లక్షలు, డూప్లికేట్ ఓట్ల సంఖ్య 3.81లక్షలుగా ఉంది. అహమ్మదాబాద్, సూరత్ వంటి పారిశ్రామిక కేంద్రాల్లో వలసలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.
అభ్యంతరాల స్వీకరణ..
తొలగించిన ఓట్లపై రెండు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 19 నుంచి జనవరి 18 వరకు అభ్యంతరాలను ఎన్నికల సంఘం స్వీకరించనుంది. నిజమైన ఓటర్లు ఫారం-6 ద్వారా తమ పేర్లు తిరిగి ఓటరు జాబితాలో చేర్చుకోవచ్చు. ఈసీ వెబ్‌సైట్లు (elections.tn.gov.in, ceo.gujarat.gov.in) లేదా voters.eci.gov.inలో పేరు చెక్ చేసుకోవచ్చు. ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా చేపట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. తమిళనాడులో రాజకీయ వివాదాలు తలెత్తినప్పటికీ, ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.






