తెల్లారినా మళ్లీ అదే సీన్ రిపీట్.. జంతర్‌మంతర్‌ ఆందోళనకు దిగిన విద్యార్థులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 03:19:58  IST  )

జంతర్‌మంతర్‌ వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తెల్లారినా మళ్లీ అదే సీన్ రిపీట్.. జంతర్‌మంతర్‌ ఆందోళనకు దిగిన విద్యార్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని జంతర్‌మంతర్ వేదికగా కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన ఇవాళ ఉదయం కూడా కొనసాగుతూనే ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ నిరసనలు ఉధృతం చేయడంతో పార్లమెంటు పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించేది లేదని, వెనక్కి తగ్గేదే లేదని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఇంటర్‌నెట్ సేవలు బంద్

వర్షాకాలం సమావేశాల వేల పార్లమెంట్ (Parliament) వద్ద పరిస్థితి చేదాటిపోకుండా ఉండేందుకు భద్రతా దళాలు హెచ్చరిక చర్యలు చేపట్టాయి. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపు వెళ్లే మార్గాలను పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. పార్లమెంట్ స్ట్రీట్, జంతర్ మంతర్ రోడ్డు, కేరళ హౌస్ వైపు వెళ్లే రహదారులను మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లకుండా మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జంతర్‌మంతర్ పరిసరాల్లో ముందస్తు జాగ్రత్తగా సీఆర్‌పీఎఫ్ (CRPF), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)తో పాటు ప్రత్యేక పోలీస్ బలగాలను భారీగా మోహరించారు. శాంతిభద్రతల విఘాత కలుగకుండా సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు భద్రతా కారణాలతో 16 మెట్రో స్టేషన్లతో పాటు పార్లమెంట్‌, జంతర్‌మంతర్‌ పరిసరాల్లోని మెట్రో స్టేషన్లను DMRC మూసివేసింది. తీవ్రమైన నిరసనల వేళ ఇంటర్నెట్ బంద్ చేయడంపై విద్యార్థులు, ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story