మృతదేహాలు ఇవ్వం.. మేమే తగులబెడతాం.. తేల్చి చెప్పిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-26 11:29:32  IST  )

సోమవారం ఉదయం మృతదేహాలను ఉంచిన ప్రభుత్వ వైద్యశాల నుండి నారాయణపూర్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వరకు ఎన్ కౌంటర్  మృతుల కుటుంబాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనతో దిగారు.

మృతదేహాలు ఇవ్వం.. మేమే తగులబెడతాం.. తేల్చి చెప్పిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు
X

దిశ ప్రతినిధి, బాపట్ల/నారాయణపూర్/బస్తర్: మే 21న నారాయణపూర్ ఎదురు కాల్పులలో మరణించినట్లు చెబుతున్న మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్, దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ మెంబర్ సజ్జ వెంకట నాగేశ్వరరావు అలియాస్ ఏసన్న, లలిత అలియాస్ సంగీత, తెలంగాణ ప్రాంతానికి చెందిన విజయలక్ష్మి అలియాస్ భూమిక, రాకేష్ అలియాస్ వివేక్ ల మృతదేహాల అప్పగింతపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా కాలయాపన చేసి, మృతదేహాలను కుళ్లబెట్టడం ద్వారా మృతుల కుటుంబాలను మానసిక వేధింపులకు గురిచేస్తుందని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సోమవారం ఉదయం మృతదేహాలను ఉంచిన ప్రభుత్వ వైద్యశాల నుండి నారాయణపూర్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వరకు ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనతో దిగారు. గత మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్ మానవ హక్కుల వేదిక ప్రతినిధి శ్రీమతి బేలా భాటియా మృతుల కుటుంబ సభ్యులను సంబంధిత పోలీసు అధికారులతో చర్చలు జరిపి మృతదేహాలను అప్పగించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు పట్టించుకోని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చట్ట వ్యతిరేక చర్యల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు చివరిగా జరిగిన సంప్రదింపులు సందర్భంగా మృతుల కుటుంబాలతో పోలీసు అధికారులు మాట్లాడుతూ "మీరు ఇక్కడే ఖననం చేయాలని లేకపోతే మేమే ఖననం చేస్తామంటూ హెచ్చరించడంతో, మృతదేహాలను మాకు అప్పగించాల్సిందే అంటూ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బాధిత కుటుంబాలు అడ్డం తిరగడంతో, మా ప్రభుత్వం నుండి మృతదేహాలు ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఐజి సుందర్ రాజ్, నారాయణపూర్ ఎస్పి ఆదేశాల మేరకు మృతదేహాలను తగులు పెడుతున్నామంటూ, ఉంటే ఉండండి లేకపోతే పొండి, కోర్టుకు వెళ్లిన మాకేం భయం లేదు అంటూ బాధిత కుటుంబాల పట్ల దురుసుగా వ్యవహరించినట్లుగా మృతుల కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

సజ్జా వెంకట నాగేశ్వరరావు రక్తసంబంధీకులు మాట్లాడుతూ, గత మూడు రోజులుగా మృతదేహాల కోసం ఎదురుచూస్తున్న తమను ఉదయం సాయంత్రం విచారణ పేరుతో వివరాలు పదేపదే అడిగినవే అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. మృతదేహాలను సురక్షితంగా భద్రపరచకుండా, కుళ్లిపోయే విధంగా హాస్పిటల్ ప్రాంగణంలో రేకుల షెడ్డు నందు ఐదు మృతదేహాలను నిర్లక్ష్యంగా వదిలివేశారన్నారు.

మృతదేహాల అప్పగింతపై హైకోర్టు

నంబళ్ల కేశవరావు సోదరుడు నంబళ్ల ఢిల్లేశ్వర్ రావు, సజ్జ వెంకట నాగేశ్వరరావు సోదరుడు సజ్జా శ్రీనివాసరావు మృతదేహాలను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆచరించగా, మే 24వ తేదీన WP N0: 13928/2025, WP N0:13929/2025 విచారణ సందర్భంగా చత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన వివరణ ప్రకారం పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అదే రోజున సంబంధిత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామని తెలిపారు. కానీ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తదుపరి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఎన్కౌంటర్ మృతుల మృతదేహాలను ఆయా కుటుంబాలకు అందజేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎన్ కౌంటర్ మృతులు నంబళ్ల కేశవరావు, సజ్జా వెంకట నాగేశ్వరరావు, సంగీత, భూమిక, రాకేష్ తదితరుల మృతదేహాలను ఈరోజు వరకు అప్పచెప్పకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా..

ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కు అనేది కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు.. గౌరవపూర్వక జీవనం, మానసిక ప్రశాంతత మొదలైనవి పౌర హక్కులుగా, భారతదేశంలో మృతదేహానికి కూడా చట్టబద్ధమైన హక్కులు, గౌరవం కల్పించబడ్డాయి. మృతదేహానికి గౌరవంగా అంత్యక్రియలు జరగాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టంగా పేర్కొంది. పోస్టుమార్టం సమయంలో మృతదేహంతో గౌరవంగా ప్రవర్తించాలి. అనవసరమైన విచ్ఛిన్నాలు చేయరాదనీ, మృతుల హక్కులను కుటుంబసభ్యులకు కల్పించాలని, కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడం లేదా వారు ఆశించే విధంగా అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కు ఉందనీ, గుర్తు తెలియని మృతదేహాలకు కూడా రక్షణ కల్పిస్తూ, ప్రభుత్వ సంస్థలు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి. జీవితానికి గౌరవం మాత్రమే కాకుండా, మరణానంతర గౌరవం మనిషి మానవతా విలువలకు అనుగుణంగా భారత న్యాయవ్యవస్థ స్పష్టం చేసింది.

Next Story