భారత్‌లో 35కు చేరిన చీతాల సంఖ్య.. ఈ నెలాఖరుకు మరో 8!?

by Jakkula.Mamatha |

మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని షియోపూర్(Sheopur) జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్‌(Kuno National Park)లో ‘ఆశ’ అనే నమీబియా చీతా ఐదు కూనలకు జన్మనిచ్చింది.

భారత్‌లో 35కు చేరిన చీతాల సంఖ్య.. ఈ నెలాఖరుకు మరో 8!?
X

దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని షియోపూర్(Sheopur) జిల్లాలో ఉన్న కునో నేషనల్ పార్క్‌(Kuno National Park)లో ‘ఆశ’ అనే నమీబియా చీతా ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకున్నారు. భారత్‌లో(India) చీతాల సంఖ్య 35కు చేరిందని ఆయన వెల్లడించారు. ఇందులో భారత్‌లో పుట్టిన కూనల సంఖ్య 24కు పెరగడం విశేషం. అంటే, ఇప్పటివరకు భారత్‌లో మొత్తం 24 చీతా పిల్లలు జన్మించాయి. మిగిలిన 11 పెద్ద చీతాలను ఆఫ్రికా దేశాల నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారు.

కాగా, ఈ నెలాఖరులో(ఫిబ్రవరి 28) బోత్స్వానా నుంచి మరో 8 చీతాలు తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు. వీటిని కూడా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తరలించనున్నారు. వీటిలో 5 ఆడ చీతాలు, 3 మగ చీతాలు ఉన్నాయి. వీటిని భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ ప్రస్తుతం నమీబియా, దక్షిణాఫ్రికా, మరియు బోత్స్వానా దేశాలతో చీతాల కోసం ఒప్పందాలు చేసుకుంది. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో సుమారు 50 నుంచి 60 చీతాలను వివిధ దశల్లో భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే.. భారత్‌లో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఖండాంతర వన్యప్రాణి పునరావాస కార్యక్రమం 'ప్రాజెక్ట్ చీతా' చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం భారత్‌లో 1952లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ దేశ అడవుల్లో అభివృద్ధి చేయడం. ఈ కార్యక్రమం మొదటగా 2022 సంవత్సరంలో సెప్టెంబర్ 17వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను తీసుకురావడంతో ప్రారంభమైంది.

Next Story