- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా పెరిగిన ఆసియా సింహాల సంఖ్య.. ఎన్నంటే?
గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య పెరిగినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లో (Gujarat) ఆసియా సింహాల (Asiatic lions) సంఖ్య పెరిగినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గిర్ అటవీ ప్రాంతంలో నివసించే ఈ ఆసియా సింహాల జనాభాను ప్రతి ఐదేళ్లకు ఒకసారి లెక్కిస్తారు. ఇందులో భాగంగా ఈనెల 10- 11 తేదీల్లో సింహాల ప్రాథమిక జనాభా గణన నిర్వహించగా, తుది జనాభా గణనను మే 12-13 తేదీల్లో ప్రాంతీయ, జోనల్, సబ్-జోనల్ అధికారులు, ఎన్యూమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యూమరేటర్లు, ఇన్‌స్పెక్టర్లు సహా 3,000 మంది స్వచ్ఛంద సేవకుల సహాయంతో నిర్వహించినట్లు పేర్కొంది. ఈ మేరకు బుధవారం సింహాల జనాభాపై నిర్వహించిన 2025 గణాంకాలను విడుదల చేసింది.
ఇక ఈ ఐదేళ్లలో సింహాల సంతతి భారీగా పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఐదేళ్ల క్రితం 674గా ఉన్న సింహాల సంఖ్య ఈ ఏడాది ఇప్పటి వరకూ 891కి పెరిగినట్లు పేర్కొంది. జునాగఢ్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, రాజ్‌కోట్, మోర్బి, సురేంద్రనగర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, అమ్రేలి, పోర్ బందర్, బోటాడ్ జిల్లాల్లో ఈ సింహాలు విస్తరించాయని తెలిపింది. సింహాలకు ఆహారం, నీరు, రక్షణ కల్పించే విషయంలో స్థానిక అటవీ యంత్రాంగం తీసుకుంటున్న శ్రద్ధ, అడవులను ధ్వంసం చేయకుండా తీసుకుంటున్న చర్యలతో గిర్ అడవుల్లోని సింహాల సంఖ్య పెరుగుతోందని చెప్పింది. ఇక అధునాతన ఆయుధాలు, సీసీ టీవీలు, రేడియో కాలర్ , జీపీఎస్ వంటి నూతన సాంకేతికతల సాయంతో అక్కడి అటవీ శాఖ సింహాలను పర్యవేక్షిస్తోంది. ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్న వేళ మృగరాజులను చూసేందుకు పర్యాటకులు సైతం భారీగా తరలివస్తున్నారు.
కాగా, 1936లో ఇక్కడ మొదటిసారి సింహాలను లెక్కించటం ప్రారంభించారు. ఆ సమయంలో ఇక్కడ సింహాల సంఖ్య 287గా ఉండేది. ఇక 1995 నుంచి గణంకాలను పరిశీలిస్తే.. సింహాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 1995లో 304 సింహాలు ఉండగా.. 2001లో 327 సింహాలు, 2005లో 359 సింహాలు, 2010లో 411 సింహాలు, 2015లో 523 సింహాలు, 2020లో 674 సింహాలు ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఆసియాటిక్ సింహం గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదు, భారతదేశ గొప్ప వన్యప్రాణుల వారసత్వానికి చిహ్నం. 'మేక్ ఇన్ ఇండియా' ప్రచార లోగోలో ఈ సింహామే ప్రముఖంగా కనిపిస్తుంది.






