నీట్ పేపర్ లీక్... ఏబీవీపీ ఆందోళనతో రణరంగంగా మారిన NTA ఆఫీస్‌ పరిసరాలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-13 10:39:24  IST  )

నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు. ఎన్టీఏ ఆఫీస్ ముట్టడికి ఏబీవీపీ యత్నం. రంగంలోకి దిగిన సీబీఐ.. ఆరు రాష్ట్రాల్లో ముమ్మర దర్యాప్తు.

నీట్ పేపర్ లీక్... ఏబీవీపీ ఆందోళనతో రణరంగంగా మారిన NTA ఆఫీస్‌ పరిసరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-యూజీని (నీట్‌-యూజీ) జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) రద్దు చేసిన సంగతి తెలిసిదే. ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఎన్‍టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. ఢిల్లీలోని ఎన్టీఏ ఆఫీస్ ఎదుట భారీ ఆందోళన చేపట్టింది. భారీగా తరలి వచ్చిన ఏబీవీపీ నేతలు ఎన్టీఏ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లు దాటుకుని కార్యాలయంలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. నిరసనకారులను పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తీరుకు ఎన్టీఏ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో ఎన్టీఏ ఆఫీస్ పరిసరాలు రణరంగంగా మారింది.

సీబీఐ దర్యాప్తు స్పీడప్:

మరో వైపు నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సీబీఐ బృందాలు విచారణ చేస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, కేరళ, ఉ్తతరాఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో సీబీఐ బృందాలు ఆరా తీస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్టీఏ అధికారుల వాంగ్మూలాలు నమోదు చేసిన సీబీఐ.. పేపర్ తయారీ, ప్రింటింగ్, లీకేజీ వెనుక ఎవరున్నారనే అంశాలపై దృష్టి సారించింది.

Next Story