- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది కేరళ స్టోరీ 2’కు హైకోర్టు సెగ.. సెన్సార్ బోర్డు, నిర్మాతలకు నోటీసులు!
సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’కి కూడా నిరసన సెగ తగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’కి కూడా నిరసన సెగ తగిలింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. చిత్ర నిర్మాతలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ ప్రధాన అభ్యంతరాలు..
జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సినిమా టీజర్, ట్రైలర్లలోని అంశాలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే మతమార్పిడులు, ఉగ్రవాద సంబంధిత అంశాలను చూపిస్తూ.. కేవలం 'కేరళ' పేరును టైటిల్‌లో వాడటం వెనుక దురుద్దేశం ఉందని, ఇది ఆ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని పిటిషనర్ వాదించారు. ట్రైలర్ చివరలో వచ్చే ‘అబ్ సహేంగే నహీ... లడెంగే’ (ఇక సహించం.. పోరాడతాం) అనే నినాదం ప్రతీకార చర్యలకు ప్రేరేపించేలా ఉందని, దీనివల్ల మత సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోపించారు. సినిమాటోగ్రఫీ చట్టం సెక్షన్ 5B ప్రకారం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న చిత్రాలకు సర్టిఫికేషన్ ఇవ్వకూడదు. అయితే, బోర్డు ఈ నిబంధనలను విస్మరించిందని పిటిషనర్ పేర్కొన్నారు.
పాత వివాదాల ప్రస్తావన..
కాగా, 2023 లో విడుదలైన మొదటి భాగం ‘ది కేరళ స్టోరీ’ సమయంలో కూడా సుప్రీంకోర్టు వరకు వివాదం వెళ్ళింది. అప్పట్లో చిత్ర బృందం ఇది ఒక కల్పిత కథ అని, అందులోని గణాంకాలకు తగిన ఆధారాలు లేవని డిస్క్లైమర్ (Disclaimer) ఇస్తామని అంగీకరించింది. అయినప్పటికీ, సీక్వెల్ విషయంలో సెన్సార్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కావాల్సి ఉంది. ఈ లోపే సినిమాపై స్టే విధించాలని పిటిషనర్ కోరగా, తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఆలోపు దీనిపై వివరణ ఇవ్వాలని నిర్మాతలను ఆదేశించింది.






