కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవి రద్దు చేసిన హైకోర్టు.. ఎమ్మెల్యేగా బీజేపీ నేత

by Prasad Jukanti |

అసంపూర్ణ సమాచారం ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని ఎంపీ హైకోర్టు రద్దు చేసింది. ఆయన ప్లేస్‍లో రెండో స్థానం నిలిచిన బీజేపీ వ్యక్తిని ఎమ్మెల్యేగా ప్రకటించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవి రద్దు చేసిన హైకోర్టు.. ఎమ్మెల్యేగా బీజేపీ నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల అఫిడవిట్ లో పూర్తి సమాచారం ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) సంచలన తీర్పు వెలువరించింది. షియోపూర్ జిల్లా విజయ్‍పూర్ (Vijaypur) నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముఖేశ్ మల్హోత్రా (Mukesh Malhotra) ఎన్నికను రద్ధు చేస్తూ ఆయన స్థానంలో రెండో స్థానంలో ఉన్న బీజేపీ నేత రామ్నివాస్ రావత్‍ను (Ramniwas Rawat) ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ జీఎస్ అహ్లువాలియా సింగ్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.

అసలేం జరిగింది?

విజయ్‍పూర్ నియోజకవర్గానికి 2024లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ మల్హోత్రా1,00,469(50.66%) ఓట్లు సాధించి గెలుపొందారు. ఆయన తర్వాత స్థానంలో బీజేపీ అభ్యర్థి రామ్‌నివాస్ రావత్: 93,105 (46.95%) ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ముఖేశ్ మల్హోత్రా విజయం సాధించినప్పటికీ ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‍లో తనపై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదు. దీంతో ఈ విషయంలో ఆయనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న న్యాయస్థానం ఈ నిబంధనలను మల్హోత్రా పాటించలేదని గుర్తించిన కోర్టు ఆయన ఎన్నికను రద్దు చేసింది. దీంతో ఉపఎన్నికలో రెండో స్థానంలో నిలిచిన రామ్‌నివాస్ రావత్‌ను ఎమ్మెల్యేగా ప్రకటించింది. మల్హోత్రాకు పైకోర్టులో అప్పీల్ చేసేందుకు ఒక వారం గడువు ఇచ్చింది.

Next Story