ఆకాశంలో అద్భుతం: కొత్త సంవత్సరంలో తొలి 'సూపర్ మూన్' కనువిందు!

by Malleboina Mahesh |

2026 నూతన సంవత్సరం ప్రారంభంలోనే ఖగోళ ప్రియులకు అద్భుతమైన దృశ్యం కనువిందు చేసింది.

ఆకాశంలో అద్భుతం: కొత్త సంవత్సరంలో తొలి సూపర్ మూన్ కనువిందు!
X

దిశ, వెబ్ డెస్క్: 2026 నూతన సంవత్సరం ప్రారంభంలోనే ఖగోళ ప్రియులకు అద్భుతమైన దృశ్యం కనువిందు చేసింది. ఈ ఏడాది మొదటి 'సూపర్ మూన్' (దీనినే వోల్ఫ్ మూన్ అని కూడా పిలుస్తారు) శనివారం (జనవరి 3, 2026) రాత్రి దేశ ప్రజలను కనువిందు చేసింది. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల ఈ అద్భుతం చోటు చేసుకుంది. సాధారణ పౌర్ణమి నాటి చంద్రుడి కంటే ఈ సూపర్ మూన్ (Super Moon) సుమారు 14 శాతం పెద్దగా, 30 శాతం అధిక ప్రకాశంతో మెరిసిపోతూ ఆకాశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

భారతదేశంలో సాయంత్రం 5:45 గంటల నుంచి చంద్రోదయం సమయంలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపించింది. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సాధారణంగా 3.84 లక్షల కిలోమీటర్లు ఉండగా, ఈ సూపర్ మూన్ సమయంలో అది 3,56,500 కిలోమీటర్లకు తగ్గింది. ముఖ్యంగా క్లియర్ స్కై ఉన్న దక్షిణ, పశ్చిమ భారత ప్రాంతాల్లో భక్తులు, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అందమైన చందమామను చూసి పరవశించిపోయారు. ఈ ఏడాదిలో కనిపించబోయే మూడు సూపర్ మూన్‌లలో ఇదే మొదటిది కావడంతో ప్రజలు తమ ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాన్ని బంధించేందుకు ఉత్సాహం చూపారు.

Next Story