మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్.. ''రూమీ-1'' ప్రయోగం విజయవంతం

by Geesa Chandu |

దేశంలో మొట్టమొదటిసారిగా పునర్వినియోగ 'రూమీ-1' అనే రాకెట్ ను చెన్నైలోని ఈసీఆర్ తిరువిడిందై తీర గ్రామం నుంచి ప్రయోగించారు.

మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్.. రూమీ-1 ప్రయోగం విజయవంతం
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో మొట్టమొదటిసారిగా పునర్వినియోగ ''రూమీ-1'' అనే రాకెట్ ను చెన్నైలోని ఈసీఆర్ తిరువిడిందై తీర గ్రామం నుంచి ప్రయోగించారు. శనివారం(ఆగస్టు 24) ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ను తమిళనాడుకు చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేశారు. సుమారుగా 80 కిలోల బరువును కలిగిన ఈ రాకెట్ ను హైడ్రాలిక్ మొబైల్ కంటెయినర్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు. రూమీ-1 రాకెట్ ద్వారా 3 క్యూబ్ శాటిలైట్లు, 50 పికో శాటిలైట్లను ఉపకక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఈ పునర్వినియోగ రాకెట్ రూమీ-1 ద్వారా ప్రవేశపెట్టిన క్యూబ్ ఉపగ్రహాలు "గ్లోబల్ వార్మింగ్, వాతావరణ పరిస్థితులు, యూవీ రేడియేషన్, కాస్మిక్ రేడియేషన్, గాలి నాణ్యత వంటి సమాచారాన్ని" సేకరిస్తాయి. పికో ఉపగ్రహాలు "ఓజోన్ పొర స్థాయి, కంపన స్థాయి వంటి తదితర పర్యావరణ సంబంధిత పరిస్థితుల్ని గుర్తించి" సమాచారాన్ని చేరవేస్తాయి.

పునర్వినియోగం ఇలా...

"రూమీ-1" అనేది ఒక జెనెరిక్ ఇంధన ఆధారిత హైబ్రిడ్ మోటార్. మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి రూమీ-1 రాకెట్ ను ప్రయోగించాక.. ఉపగ్రహాలు భూ కక్ష్యలోకి దూసుకెళ్లే మార్గంలో కొంత దూరం ప్రయాణించాక రాకెట్ సముద్రంలో పడిపోయేకంటే ముందే, సంబంధిత రాకెట్ శకలాలు తిరిగి భూమిని చేరేలా, రాకెట్ లోనే పారాచ్యూట్ లను అమర్చారు. భూమికి దగ్గరలో 35 కిలోమీటర్లు ఎత్తుకు రాకెట్ సమీపించాక, పారాచ్యూట్లు తెరుచుకొని రాకెట్ సురక్షితంగా భూమిని చేరుకుంటుంది. తర్వాత సెన్సార్ల సాయంతో ఆ రాకెట్ శకలాల్నిసేకరించి, తదుపరి మరొక రాకెట్ ప్రయోగానికి వినియోగించనున్నారు. ఈ మిషన్ కు ఇస్రో శాటిలైట్ సెంటర్ (ISAC) మాజీ డైరెక్టర్ మైల్ స్వామి అన్నాదురై మార్గదర్శకత్వంలో.. స్పేస్ జోన్ వ్యవస్థాపకుడు ఆనంద్ మేగ లింగం నాయకత్వం వహిస్తున్నారు. కాగా స్పేస్ జోన్ ఇండియా అనేది చెన్నైలోని ఒక ఏరో సాంకేతిక సంస్థ.

Next Story