'ఆపరేషన్ కగార్' సక్సెస్.. ఆరు దశాబ్దాల సాయుధ పోరాటానికి తెర?

by Naga Rani Yarlagadda |

కేంద్రం విధించిన ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ పూర్తయింది. 11 రాష్ట్రాలు తమను మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయి.

ఆపరేషన్ కగార్ సక్సెస్.. ఆరు దశాబ్దాల సాయుధ పోరాటానికి తెర?
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో నక్సలిజం అంతం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్ నిన్నటితో ముగిసింది. చివరిరోజున మరో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో 35 మంది (బీజాపూర్‌లో 25 మంది, దంతెవాడలో ఐదుగురు, సుక్మాలో ఇద్దరు, నారాయణ్‌పూర్‌‌లో ఒక్కరు, కాంకేర్‌‌లో ఇద్దరు), మహారాష్ట్రలోని గడ్చిరోలిలో తొమ్మిది మంది నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగిసిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందినట్టుగా ప్రకటించుకున్నాయి. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ లేదని (21 మందిలో ఒక్కరు మినహా) వారంతా లొంగిపోయారని లేదా అరెస్టయ్యారని, లేదా ఎన్‌కౌంటర్ అయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొన్న పార్లమెంటులో వెల్లడించారు. దాదాపుగా దేశంలో నక్సలిజం అంతమైపోయిందని డెడ్‌లైన్‌కు ఒక రోజు ముందు ప్రకటించారు. తమ రాష్ట్రంలో నక్సలిజం లేదని మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. తమ రాష్ట్రం నుంచి ఉద్యమంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారని తెలంగాణ వెల్లడించింది. సుమారు డజను మంది నక్సలైట్లు మిగిలారని, వారి లక్ష్యంగానే ఆపరేషన్ చేపడుతామని ఒడిశా పేర్కొంది. డెడ్‌లైన్‌తోనే నక్సలైట్ల లొంగుబాటు కార్యక్రమం ముగిసిందని, ఇక లొంగుబాట్లకు అవకాశం లేదని, ఉన్నవారిని ఎన్‌కౌంటర్ చేయడమే మిగిలిన లక్ష్యమని ఒడిశా ఏడీజీపీ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) సంజీబ్ పాండా స్పష్టం చేశారు.

చివరిరోజు.. 44 మంది లొంగుబాటు

కేంద్రం విధించిన డెడ్‌లైన్ చివరిరోజున (నిన్న) ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఒక్క బీజాపూర్‌‌లోనే 25 మంది మావోయిస్టులు లొంగుబాటపట్టారు. గంగలూరు పోలీసు స్టేషన్‌లో దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో గంగలూరు ఏరియా కమిటీ, కిష్టారం ఏరియా కమిటీ, భైరమ్‌గడ్ ఏరియా కమిటీలకు చెందిన 25 మంది ముఖ్య సభ్యులు లొంగిపోయారు. పశ్చిమ బస్తర్ డివిజన్‌కు చెందిన సోమ కడ్తి, లక్ష్మా ఓయం, సరిత పొడియం, జోగి కల్మూ, మోతి ఓయంలు దంతెవాడలో లొంగిపోయారు. వీరందరిపై రూ.9 లక్షల రివార్డు ఉన్నది. రూ.8 లక్షల చొప్పున రివార్డున్న ఇద్దరు మావోయిస్టులు సుక్మాలో సరెండర్ అయ్యారు. నారాయణ్‌పూర్‌లో ఎస్పీ రాబిన్సన్ గురియా సమక్షంలో రూ. లక్ష రివార్డున్న బిజ్లు మాండవి నారాయణ్‌పూర్‌లో లొంగిపోయారు. కాంకేర్ జిల్లాలో మరో ఇద్దరు సరెండర్ అయ్యారు. కాగా, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో తొమ్మిది మంది మావోయిస్టులు గడ్చిరోలి పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. ఇందులో ముగ్గురు సీనియర్ నేతలు ఏరియా కమిటీ సభ్యులు. ఈ లొంగుబాట్లలో భారీగా ఆయుధాలనూ నక్సలైట్లు సరెండర్ చేశారు.

ఆరు దశాబ్దాల ఉద్యమం

మావోయిస్టు ఉద్యమం మన దేశంలో ఆరు దశాబ్దాలపాటు సాగింది. తొలినాళ్లలో విశేష ప్రజాధారణతో దావానలంలా వ్యాపించింది. దాదాపు డజను రాష్ట్రాలకు విస్తరించిన ఉద్యమం క్రమంగా ప్రధానంగా 3 నాలుగు రాష్ట్రాలకు కుచించుకుపోయింది. పీక్ స్టేజ్‌లో 126 జిల్లాల్లో కార్యకలాపాలు సాగించిన మావోయిస్టు పార్టీ.. దండకారణ్యంలో కొన్నాళ్లు సమాంతర ప్రభుత్వాన్నీ నడిపింది. కాగా, 2019లో దేశంలో మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించాలని కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. 2024లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆపరేషన్ కగార్ అనూహ్య వేగాన్ని అందుకుంది. రెండేండ్ల ముందుగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్‌లైన్ (మార్చి 31, 2026) విధించారు. 2023లో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టాక మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది. పార్టీని దాదాపుగా అంతమొందించే లక్ష్యంలో ఈ ఆపరేషన్ సఫలమవ్వగా.. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 11 మధ్య కర్రెగుట్టలు టార్గెట్‌గా చేపట్టిన ఆపరేషన్‌ బ్లాక్ ఫారెస్ట్‌లో పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ ఒక కుదుపు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్ మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌‌తో పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. కగార్ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లలో నంబాల, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, గణేశ్, ప్రయాగ్‌లు మరణించగా.. సోనూ, ఆశన్న, దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనాయకత్వం లొంగిపోయింది. దీంతో మావోయిస్టు పార్టీకి నాయకత్వం దాదాపుగా లేకుండా పోయింది. దీంతో కిందిస్థాయి కేడర్లు కూడా పెద్ద సంఖ్యలో లొంగుబాటపట్టారు.

ఆచూకీ లేని గణపతి!

డెడ్‌లైన్‌లోపు మావోయిస్టు పార్టీ క్రియాశీలక నాయకత్వం దాదాపుగా లేకుండాపోయింది. అక్కడక్కడ కొన్ని కేడర్లు ఉన్నా స్వల్పకాలంలోనే వారంతా లొంగిపోవడమో లేదా ఎన్‌కౌంటర్ అవ్వడమో జరిగే పరిస్థితులున్నాయి. దాదాపుగా ప్రస్తుతం దేశంలో మావోయిస్టు పార్టీ ఉనికి లేదని చెప్పొచ్చని స్వయంగా కేంద్రమంత్రి అమిత్ షానే చెప్పారు. అయితే, ఫార్మల్‌గా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా అజ్ఞాతంలోనే ఉన్న మావోయిస్టు పార్టీ కీలక నేతలు గణపతి, మిసిర్ బెస్రా, పసునూరి నరహరిల చుట్టూ ఆసక్తి నెలకొంది. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ గణపతి అడవిలో లేడని, పట్టణ ప్రాంతంలోనే ఉండి ఉంటాడని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు.

Next Story