- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుగులేని ముహూర్తం పెట్టిన DK గురువు.. అప్పటి వరకు హైకమాండ్ ఆగుతుందా?
డీకే గతంలో పడ్డ కన్నీళ్లు, డిప్రెషన్ పై ఆయన జ్యోతిష్యుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాజకీయాలు చారిత్రాత్మక మలుపు తిరుగుతున్నాయి. పవర్ షేరింగ్‍లో భాగంగా ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయగా ఈ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. దీంతో కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం లాంఛన ప్రాయంగా మారింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీఎం పీఠంపై డీకే ఎప్పుడు కూర్చోబోతున్నారు? ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇటువంటి తరుణంలో డీకే శివకుమార్ జోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 5వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని డీకేకు సూచించినట్లు చెప్పారు. ఆరోజు చాలా మంచి రోజు అని, వచ్చే డిసెంబర్ వరకు అటువంటి మూహుర్తం మళ్లీ లేదన్నారు. దీంతో డీకే తన గురువు చెప్పినట్లు వచ్చే నెల 5వ తేదీనే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక హైకమాండ్ ఆదేశాల మేరకు ఆలోపే సీఎం కుర్చీపై కూర్చుంటారా అనేది ఆసక్తిగా మారింది.
కన్నీళ్లు.. డిప్రెషన్:
ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన బెల్లూరు ద్వారకానాథ్.. డీకేకు సంబంధించిన పలు కీలక విషయాలు షేర్ చేసుకున్నారు. గడిచిన మూడేళ్లుగా సిద్ధరామయ్య క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఎలా గడిపారనే ప్రశ్నపై స్పందిస్తూ.. డీకే అంత సులభంగా లొంగిపోయే వ్యక్తి కాదు. చివరి వరకు పోరాడటం ఆయన నైజం అన్నారు. గతంలో సీఎం కాలేకపోతున్నాననే బాధతో ఆయన ఎన్నోసార్లు నా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు, తీవ్ర నిరాశలోకి (Depression) వెళ్లారు. కానీ నేను ఎప్పుడూ ఆయనకు ధైర్యం చెబుతూ వచ్చాను. నువ్వు కచ్చితంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటావు, నీ కాలం వస్తుందని నమ్మకంగా చెప్పాను. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోందని ద్వారకానాథ్ పేర్కొన్నారు.
సీఎం పదవి ముళ్ల బాట:
డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమయ్యాక ఆయనకు తాను కొన్ని కీలక సూచనలు చేసినట్లు ద్వారకానాథ్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని అంగీకరించు, కానీ ఈ ప్రయాణం ముళ్లతో కూడుకున్నదని హెచ్చరించానని కేవలం పనిపైనే దృష్టి పెట్టాలని చెప్పానన్నారు. ఇకపై ఎవరినీ నెత్తిన పెట్టుకోవద్దని, గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలని సలహా ఇచ్చానని అలా చేసినప్పుడే సక్సెస్ అవుతావని సూచించినట్లు తెలిపారు. ఆయన సీఎం కుర్చీలో కూర్చునే రోజు మంచి వర్షాలు పడాలని, మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాను ఆయన ఒక సన్యాసిలా మారి, సర్వస్వాన్ని త్యాగం చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని ఆశిస్తున్నాను. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతో ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలి. నేనుకోరుకునేది అదే అని చెప్పారు.
తెరపైకి విజయ్ జ్యోతిష్యుడి అంశం:
రాజకీయనాయకులు తమ విశ్వాసాలకు అనుగుణంగా గురువులు, జ్యోతిష్యంపై నమ్మకం ఉంచడం చూస్తూనే ఉంటాం. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ తాను విశ్వసించే జ్యోతిష్యుడు, ప్రముఖ ఆస్ట్రాలజర్ రాధా పండిట్ ను సీఎంఆఫీసులో ఓఎస్డీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఆ ఉత్తర్వులను 24 గంటలు గడవకముందే వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో డీకే శివకుమార్ జ్యోతిష్యుడి మాటలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రాధా పండిట్ ను గుర్తు చేసుకుంటున్నారు.






