- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 1.41 లక్షల జీతం.. అయినా రూ. 1.35 లక్షలు భరణం ఇవ్వాలన్న కోర్టు.. నెట్టింట తీవ్ర చర్చ!
నెలకు ₹1.41 లక్షలు సంపాదిస్తున్న భార్యకు, వివాహ జీవితంలోని జీవనశైలిని కొనసాగించేందుకు గాను భర్త తన ₹2.79 లక్షల జీతం నుండి ₹1.35 లక్షలు భరణం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఓ విడాకుల కేసులో రూ. 1.41 లక్షల జీతం పొందే భార్యకు భర్త రూ. 1.35 లక్షల భరణం ఇవ్వాలన్న కోర్టు నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లయిన కేవలం ఆరు నెలలకే విడాకుల కోసం ఒక సాఫ్ట్‌వేర్ దంపతులు కోర్టుకెక్కారు. ఈ కేసులో పుణె కోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా భార్యకు ఆదాయం లేనప్పుడు, తక్కువ ఆదాయం ఉన్నప్పుడు కోర్టులు భరణం (Maintenance) మంజూరు చేస్తాయి. కానీ, ఈ కేసులో భార్య ఇప్పటికే నెలకు లక్షకు పైగా సంపాదిస్తున్నప్పటికీ, కోర్టు భర్త జీతంలో దాదాపు సగాన్ని భరణంగా ఇవ్వాలని ఆదేశించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
లైఫ్‌స్టైల్ కొనసాగించే హక్కు ఉందంటూ..
వివరాల్లోకి వెళితే.. పుణెకు చెందిన సదరు దంపతులిద్దరూ ఐటీ రంగానికి చెందిన మంచి ఉద్యోగులే. భర్త నెల జీతం ₹2,79,499 కాగా, భార్య నెల జీతం ₹1,41,436. అయితే పెళ్లైన ఆరు నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో భార్య కోర్టులో వాదిస్తూ.. తాను ఒంటరిగా బతకడానికి తన జీతం సరి పోతున్నప్పటికీ, పెళ్లయిన ఆ 6 నెలల కాలంలో భర్త ఇంట్లో తాను అనుభవించిన లగ్జరీ జీవనశైలిని (Lifestyle) విడాకుల తర్వాత కూడా కొనసాగించే హక్కు తనకు ఉందని, అందుకు అదనపు డబ్బు కావాలని డిమాండ్ చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. భర్త తన జీతం నుంచి ప్రతి నెలా ₹1.35 లక్షలను ఆమెకు భరణంగా చెల్లించాలని స్పష్టం చేసింది.
నెటిజన్ల ఆగ్రహం..
ఈ తీర్పుతో భర్తకు భరణం పోగా కేవలం ₹1.44 లక్షలు మిగులుతుండగా.. భార్యకు తన సొంత జీతం, భరణం కలిసి నెలకు ఏకంగా ₹2.76 లక్షల ఆదాయం సమకూరుతుంది. దీనికి తోడు, భర్త చెల్లించే ఈ భరణం మొత్తం 'వ్యక్తిగత ఖర్చుల' కిందకు వస్తుంది కాబట్టి అతనికి ఆదాయపన్ను (Income Tax) నుండి ఎలాంటి మినహాయింపు దక్కదు. అంటే భర్త తన పూర్తి జీతానికి పన్ను కడుతూనే, అందులో సగాన్ని భార్యకు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఈ వివరాలు నెట్టింట వైరల్ కావడంతో.. "ఇదెక్కడి న్యాయం? పురుషుల హక్కులను, వారి తల్లిదండ్రుల బాధ్యతలను కోర్టులు ఎందుకు పట్టించుకోవడం లేదు?" అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.






