‘ధురంధర్’ కంటే నేను చేసిన సినిమాలకే ఎక్కువ మంది వచ్చారు.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ కంటే కూడా ‘గదర్’ సిరీస్‌ను ఎక్కువ మంది థియేటర్లలో చూశారని ఆమె పెద్ద ప్రకటన చేశారు

‘ధురంధర్’ కంటే నేను చేసిన సినిమాలకే ఎక్కువ మంది వచ్చారు.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్, ధురంధర్: ది రివెంజ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు భారీ కలెక్షన్లను రాబట్టడంతో పాటుగా పలు రికార్డులు తిరగరాసాయి. అలాగే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ రెండు చిత్రాలకంటే తను చేసిన సినిమాలు గదర్: ఏక్ ప్రేమ్ కథ, 2023లో వచ్చి గదర్-2’ ఎక్కువ మంది చూశారని అమీషా పటేల్ అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా వల్ల తనకు భారతదేశంలోనే కాకుండా, పాకిస్తాన్‌లోనూ ఊహించని స్థాయిలో భారీగా అభిమానులు ఏర్పడ్డారని ఆమె తెలిపారు. ‘గదర్’ చూసి పాకిస్తాన్‌లోని వృద్ధులు, మహిళలు ఎంతో భావోద్వేగానికి గురయ్యారని.. తన పాత్ర అయిన సకినా అందరినీ ఏడిపించేసిందంటూ కొందరు ఫోన్లు చేసి మరీ చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, ఆ దేశంలో చాలామంది తమ ఆడపిల్లలకు సకినా అని తన పాత్ర పేరు కూడా పెట్టుకున్నట్లు అమీషా వెల్లడించారు.

మొదటి రోజు నుంచే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 100 శాతం కలెక్షన్లతో ‘గదర్’ సంచలనం సృష్టించినప్పటికీ.. ఆ విజయాన్ని ఆస్వాదించే సమయం తనకు దక్కలేదని అమీషా అన్నారు. 2000వ దశకం ప్రారంభంలో బాలీవుడ్ నటీనటులు ఏడాదికి ఒకేసారి ఐదు సినిమాల వరకు షూటింగులు చేస్తూ వరుస షెడ్యూల్స్‌తో గడిపేవారని.. తాను కూడా ఒక సెట్ నుండి మరో సెట్‌కు నిరంతరం పరుగులు పెట్టడం వల్లే ఈ బాక్సాఫీస్ హంగామాను అప్పట్లో సరిగ్గా గమనించలేకపోయానని ఆమె చెప్పారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ ‘గదర్-2’ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి సరికొత్త రికార్డులు నెలకొల్పిందని అమీషా పేర్కొన్నారు. థియేటర్లలో ఈ రెండు భాగాలను చూసిన ప్రేక్షకుల సంఖ్య దేశంలోనే అత్యధికమని.. రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ కంటే కూడా ‘గదర్’ సిరీస్‌ను ఎక్కువ మంది థియేటర్లలో చూశారని ఆమె పెద్ద ప్రకటన చేశారు. భారత సినిమా చరిత్రలో తాను కూడా భాగస్వామ్యం కావడం తనకెంతో గర్వంగా, సంతోషంగా ఉందని అమీషా పటేల్ ఎమోషనల్ అయ్యారు.

Next Story