- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి.. లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు భారత్‌పై ప్రభావం చూపకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీ లోక్‌సభలో వివరించారు.

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక అంశాలపై అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నామని అన్నారు. మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచి ముడిచమురు, గ్యాస్ వస్తోందని తెలిపారు. యుద్ధం వల్ల ఇతర దేశాలతో జరిగే వాణిజ్యం దెబ్బతింటోందని వివరించారు. ముడిచమురును సముద్రమార్గం ద్వారానే మనం తెచ్చుకుంటున్నామని అన్నారు.
దేశ ప్రజలపై భారం పడకుండా చర్యలు..
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై నిరంతరం చర్చలు జరిపామని గుర్తు చేశారు. అక్కడ చదువుకునే మనదేశ పిల్లల భద్రతకు ఇబ్బంది లేకుండా చూశామని అన్నారు. భారత్‌కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నాం
ముడిచమురు, ఎల్‌పీజీ గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఇప్పుడు 41 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో ప్రస్తుతం 54 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం మనకు సరిపడా నిల్వలు ఉన్నాయని; ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన నౌకలు సురక్షితంగా భారత్ చేరేలా జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నామని అన్నారు.
ఇక మరోవైపు రైల్వేలో విద్యుదీకరణ వల్ల డీజిల్ వినియోగం బాగా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీ బస్సులు, ఇతర వాహనాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈవీ వాహనాలు భవిష్యత్తులో మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ సమస్య వచ్చినా దాని ప్రభావం భారత్‌పై పడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆ ప్రభావం దేశంపై పడకుండా మనం స్వయం సమృద్ధి సాధించాలన్నారు.






