దేశంలో మారుతున్న విద్యా వ్యవస్థ.. ప్రైవేట్ స్కూళ్ల వైపు విద్యార్థుల మొగ్గు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-28 15:23:34  IST  )

కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన UDISE+ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి.

దేశంలో మారుతున్న విద్యా వ్యవస్థ..  ప్రైవేట్ స్కూళ్ల వైపు విద్యార్థుల మొగ్గు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ పాఠశాల విద్యా రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘యుడైస్+ 2025-26’ నివేదికను 2022-23 నాటి డేటాతో సరిపోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు విశేషంగా మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టమవుతోంది.

అయితే, గడిచిన మూడేళ్ల కాలంలో ప్రైవేట్ అన్-ఎయిడెడ్ (Private Unaided) పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఏకంగా 17 శాతం పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు 13 శాతం మేర క్షీణించడం గమనార్హం. ఇదే ట్రెండ్ ఉపాధ్యాయుల సంఖ్యలోనూ కనిపిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య 17 శాతం వృద్ధి చెందగా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ పెరుగుదల కేవలం 5 శాతానికే పరిమితమైంది. ఈ నివేదిక కేవలం విద్యార్థుల చేరికలనే కాకుండా ఇతర కీలక అంశాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో సెకండరీ స్కూల్ డ్రాపౌట్ రేటు 7 శాతంగా నమోదైంది. ఈ జాబితాలో లడఖ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక డ్రాపౌట్ రేటు నమోదైనట్లు డేటా స్పష్టం చేస్తోంది. మరోవైపు పాఠశాల విద్యలో విద్యార్థుల లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది బాలురకు 938 మంది బాలికలుగా ఉంది. మారిన జీవన ప్రమాణాలు, ఇంగ్లీష్ మీడియం బోధనపై ఆసక్తి, మెరుగైన మౌలిక వసతుల సాధనతో పాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ప్రైవేట్ విద్యాసంస్థలు వేగంగా విస్తరించడం వంటి అనేక కారణాలు ఈ మార్పుకు దోహదం చేస్తున్నాయని విద్యా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇది పరిస్థితి..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వెనుకబడ్డాయి. తెలంగాణలో సర్కారు బడుల్లో చేరికలు 12 శాతం వరకు తగ్గగా.. మరోవైపు ఏపీలో 18 శాతం మేర చేరికలు తగ్గాయి. ‘ప్రైవేటు పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలు ముద్దు’ అనే నినాదాన్ని గతేడాది ఏపీలో విద్యాశాఖ అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. సర్కారు బడుల్లో విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కులను ప్రదర్శిస్తూ.. ర్యాలీ నిర్వహించారు. అయినా.. విద్యార్థుల చేరికల్లో మార్పులు రాకపోవడం గమనార్హం. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యార్థల చేరికలో ప్రతికూలత కనిపించినప్పటికీ, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు దీవుల్లో 6 శాతం, లక్షద్వీప్‌లో 1శాతం మేర విద్యార్థుల నమోదు పెరగడం విశేషం.

Next Story