New IT Bill-2025: సోమవారం లోక్ సభలో కొత్త ఐటీ బిల్లు.. వారికి భారీగా ప్రయోజనాలు?

by Prasad Jukanti |   (  Updated:2025-08-08 11:38:52  IST  )

కొత్త ఆదాయపు పన్ను చట్టం -2025 విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

New IT Bill-2025: సోమవారం లోక్ సభలో  కొత్త ఐటీ బిల్లు.. వారికి భారీగా ప్రయోజనాలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లు -2025 (Income Tax Bill 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ బిల్లు-1961 ను ఉపసంహరించుకుంది. దీని స్థానంలో సవరణలతో కూడిన కొత్త ఐటీ యాక్ట్ ను తీసుకురాబోతున్నది. ఈ మేరకు కొత్త బిల్లును వచ్చే సోమవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. మారిన పరిస్థితులకు అనుగణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆరు దశాబ్దాలుగా దేశంలో అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో నూతన బిల్లు 2025ను ఈ ఏడాది ఫిబ్రవరి లో లోక్ సభలో ప్రవేశపెట్టింది. అయితే దీనిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ బిల్లు పరిశీలనకు బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా అధ్యక్షతన సెలెక్ట్ కమిటీకి పంపింది. దీనిపై అధ్యయనం చేసిన ఈ కమిటీ గత జులై 21న తుది నివేదికను పార్లమెంట్ కు సమర్పించింది. మొత్తం 4500 పేజీలతో కూడిన ఈ నివేదికలో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు సూచించింది. అయితే ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా తుది మెరుగులు దిద్దిన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 11న లోక్ సభ ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

సులభతరంగా కొత్త యాక్ట్:

1961 ఐటీ చట్టం ఇప్పటి వరకు 4,000 కంటే ఎక్కువ సవరణలకు గురైంది. అలాగే 5 లక్షలకు పైగా పదాలతో కలిగి ఉన్న ఈ చట్టం అర్థం చేసుకోవడంలో చాలా కష్టతరంగా మారింది. దీంతో పాత చట్టం స్థానంలో కొత్త బిల్లును దాదాపు 50 శాతం సులభతరం చేసేలా రూపొందిచేలా కసరత్తు చేసింది. సాధారణ పన్ను చెల్లింపుదారులు చదవడం, అర్థం చేసుకోవడం ఈజీ అయ్యేలా కొత్త చట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పన్ను చెల్లింపుదారులందరికీ ప్రయోజనం చేకూర్చేలా స్లాబ్ ల రేట్లను అన్ని విధాలుగా మార్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటిపై ఆదాయం పొందుతున్న వారికి కొత్త చట్టం భారీ ఉపశమనం కలిగేలా ప్రతిపాదనలు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గృహ రుణ వడ్డీతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు కేవలం సొంతింట్లో ఉంటున్నవారికి మాత్రమే వర్తిస్తుండగా ఇకపై సొంతింటిని అద్దెకు ఇచ్చిన సందర్భాల్లోనూ వడ్డీతో పన్ను మినహాయింపు కల్పించాలని కొత్త చట్టంలో సిఫార్సులు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story