‘బంగారు బెంగాల్’ శకానికి నాంది.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు సువేందు అధికారి ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

‘బంగారు బెంగాల్’ శకానికి నాంది.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు సువేందు అధికారి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో ముఖ్యమంత్రిగా ఖరారైన సువేందు అధికారి.. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయనను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కోల్‌కతాలోని ప్రఖ్యాత బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ నేత, కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్‌లో ఏముందంటే.. ‘సిటీ ఆఫ్ జాయ్ (కోల్‌కతా)కి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకడం అత్యంత గర్వకారణం, ఆనందదాయకం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవాన్ని కనులారా చూస్తున్న ఈ రోజున, మన పార్టీ వ్యవస్థాపక పితామహుల కలలను మనం నెరవేరుస్తున్నాం. దశాబ్దాల పాటు సాగిన దుష్టపాలనకు నేటితో ముగింపు పలకడమే కాకుండా.. అభివృద్ధి, శాంతి, శ్రేయస్సులతో కూడిన ‘డబుల్ ఇంజిన్’ శకానికి నాంది పలుకుతున్నాం. ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) శకం అధికారికంగా ఈ రోజే ప్రారంభమైంది. స్వాగతం ప్రధాన మంత్రి జీ.’ అని పేర్కొన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుండటంతో కోల్‌కతా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.

Next Story