మల్లోజుల బాటలోనే ఆశన్న టీమ్.. రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట సరెండర్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-15 12:14:29  IST  )

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న@రూపేశ్@తక్కళ్లపల్లి వాసుదేవరావు నేతృత్వంలో వివిధ స్థాయిలకు చెందిన దాదాపు 70 మంది పార్టీ కేడర్లు రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ సమక్షంలో లొంగిపోనున్నట్లుగా జగ్దల్‌పూర్ నుంచి విశ్వసనీయ సమాచారం అందింది.

మల్లోజుల బాటలోనే ఆశన్న టీమ్.. రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట సరెండర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న@రూపేశ్@తక్కళ్లపల్లి వాసుదేవరావు నేతృత్వంలో వివిధ స్థాయిలకు చెందిన దాదాపు 70 మంది పార్టీ కేడర్లు రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ సమక్షంలో లొంగిపోనున్నట్లుగా జగ్దల్‌పూర్ నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. తమ ఆయుధాలను సైతం అప్పగించే ఈ బృందంలో డీకేఎస్‌జడ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. వీరంతా ఇప్పటికే జగ్దల్‌పూర్ చేరుకున్నారని, రేపు నిర్వహించే లొంగుబాటు సభకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం గడ్చిరోలిలో జరిగిన ఒక సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు అభయ్@సోనూ@భూపతి@మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే.

మిలిటరీ వ్యూహాల నిపుణుడు ఆశన్న..

లొంగిపోయే నాయకుల్లో కీలకమైన వ్యక్తి కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న@రూపేశ్@తక్కళ్లపల్లి వాసుదేవరావు. వరంగల్ జిల్లాకు చెందిన ఆశన్న గత 45 ఏళ్ల నుంచీ మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పట్టణాల్లో జరిగిన ఎన్నో గెరిల్లా దాడుల వెనక ఆయన హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు. గత పదేళ్లకు పైగా ఆయన రూపేశ్ పేరుతో పశ్చిమ సబ్ జోనల్ కమాండ్ ఇన్చార్జిగా ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శాంతి చర్చలకు తమ పార్టీ సిద్ధమని చెబుతూ స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆశన్న కూడా సోనూ వెంటే ఉన్నాడని, తను కూడా మరికొందరితో లొంగిపోతాడని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపటి కార్యక్రమం జరగనుంది.

ఆశన్న కాకుండా ఉత్తర బస్తర్ ఇంచార్జ్‌గా ఉన్న ఎస్‌జడ్సీ సభ్యుడు రాజమన్ (తెలంగాణ వాసి), మాడ్ డివిజన్ ఇన్చార్జిగా ఉన్న రనిత (అబూజ్‌మాడ్ ఫస్ట్ రిక్రూట్)లు కూడా లొంగిపోతారని అంటున్నారు. వీరే కాకుండా ఈ రెండు డివిజన్లకు చెందిన పలువురు డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ ఏరియా కమిటీల సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. ఈ లొంగుబాటు సభపై బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఈరోజు సాయంత్రం కాని, రేపు ఉదయం కాని ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story