ఆ గ్రామంలో జనాభా 1500.. 3 నెలల్లో జననాలు 27,000.. అవాక్కయిన అధికారులు

by Muthe.Rajitha |

ఆ గ్రామంలో ఉన్న జనాభా కేవలం 1500 మాత్రమే. కానీ గడిచిన 3 నెలల్లో ఆ గ్రామంలో 27 వేల జననాలు నమోదయ్యారు.

ఆ గ్రామంలో జనాభా 1500.. 3 నెలల్లో జననాలు 27,000.. అవాక్కయిన అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆ గ్రామంలో ఉన్న జనాభా కేవలం 1500 మాత్రమే. కానీ గడిచిన 3 నెలల్లో ఆ గ్రామంలో 27 వేల జననాలు నమోదయ్యారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీయగా.. భారీ మోసం బయటపడింది. మహారాష్ట్రలో యవత్మాల్‌ జిల్లాలోని శేందుర్‌సనీ అనే చిన్న గ్రామంలో ఈ బర్త్ సర్టిఫికెట్స్ స్కామ్‌ బయటపడింది. కేవలం 1500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో కేవలం మూడు నెలల్లోనే 27 వేలకుపైగా జననాలు నమోదవడం చూసి అధికారులు విచారణ చేపట్టారు. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ మధ్య 3 నెలల కాలంలో సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌లో 27,397 జననాలు, కేవలం 7 మరణాలు నమోదు చేసినట్లు గుర్తించారు. రికార్డులు పరిశీలించగా గ్రామ పంచాయతీ లాగిన్‌ ఐడీని ముంబయికి మ్యాప్‌ చేసినట్టు తేలింది.

అయితే ఇది సైబర్‌ నేరస్తుల పని అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసమో, అక్రమ కార్యకలాపాల కోసం నకిలీ జనన ధ్రువపత్రాలు సృష్టించి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ జననాల్లో 99 శాతం పేర్లు పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందినవేనని, బంగ్లాదేశ్‌ వలసదారుల ఉన్నారని గుర్తించారు. నకిలీ జనన ధ్రువపత్రాలను వెంటనే తొలగించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను డిమాండ్ చేస్తున్నాయి.

Next Story