వివాదాలపై నోరు విప్పిన దళపతి విజయ్.. విడాకులపై పరోక్ష స్పందన

by Gantepaka Srikanth |

గతకొద్ది రోజులుగా తన వ్యక్తిగత జీవితం మరియు సినిమా విడుదలపై వస్తున్న వార్తలపై తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ తొలిసారిగా స్పందించారు.

వివాదాలపై నోరు విప్పిన దళపతి విజయ్.. విడాకులపై పరోక్ష స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొద్ది రోజులుగా తన వ్యక్తిగత జీవితం మరియు సినిమా విడుదలపై వస్తున్న వార్తలపై తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్(Thalapathy Vijay) తొలిసారిగా స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మామల్లపురంలో తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణల వల్ల అభిమానులు పడుతున్న బాధను చూసి తాను కూడా బాధపడుతున్నానని విజయ్ పేర్కొన్నారు.

మీరు బాధపడకండి..

"ఇటీవల కాలంలో ఎన్నో వివాదాలు వస్తున్నాయి. మీలో చాలామంది నాకు మద్దతుగా నిలుస్తూ, ఆ వార్తల వల్ల బాధపడుతున్నారని నాకు తెలుసు. అది చూసి నాకూ బాధగా ఉంది. నా వ్యక్తిగత సమస్యలన్నీ నేను చూసుకుంటాను. ఆ విషయాలు అసలు పట్టించుకోదగ్గవి కావు, కాబట్టి వాటి గురించి ఆలోచించి మీరు బాధపడకండి. మనమందరం కేవలం ప్రజల సమస్యలపైనే దృష్టి పెడదాం" అని విజయ్ పిలుపునిచ్చారు. అయితే.. నేరుగా తన విడాకుల ప్రస్తావన తీసుకురానప్పటికీ, తనపై వస్తున్న వివాహేతర సంబంధం ఆరోపణలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మహిళల కోసం భారీ హామీలు

ఈ సభలో విజయ్ మహిళల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. మహిళలకు నెలకు రూ.2,500 నగదు పంపిణీ, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆడపిల్లల పెళ్లికి ఎనిమిది గ్రాముల బంగారం, తమిళనాడు అంతటా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పుట్టిన పసిబిడ్డలకు బంగారు ఉంగరం ఇస్తామని హామీ ఇచ్చారు.

Next Story