Thailand: థాయిలాండ్‌లో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు.. ఆసియాలో మూడో దేశంగా రికార్డ్

by B.Srinivas |

థాయిలాండ్‌లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు లభించింది. గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది.

Thailand: థాయిలాండ్‌లో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు.. ఆసియాలో మూడో దేశంగా రికార్డ్
X

దిశ; నేషనల్ బ్యూరో: థాయిలాండ్‌ (Thailand)లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు లభించింది. గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గే మ్యారేజెస్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ గత 20 ఏళ్లుగా దేశంలో పోరాటాలు జరిగాయి. దీంతో ఇటీవల థాయిలాండ్ పార్లమెంట్ దీనిని ఆమోదించగా గతేడాది సెప్టెంబర్‌లో థాయిలాండ్ రాజు దానికి ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇది అమల్లోకి వచ్చింది. ఈ విధానం అమల్లోకి రాగానే సుమారు 200 స్వలింగ జంటలు పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పలు చోట్ల సంబురాలు నిర్వహించారు. దీంతో ఆసియాలో స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్దం చేసిన మూడో దేశంగా థాయిలాండ్ ఘనత సాధించింది. అంతకుముందు నేపాల్ (Nepal), తైవాన్‌ (Thaiwan)లు ఈ తరహా పెళ్లిళ్లను చట్టపరమైనవిగా గుర్తించారు.

ఈ సందర్భంగా థాయ్‌లాండ్‌ ప్రధాని పటోంగ్‌టర్న్‌ షినవత్రా (shinavathra) స్పందిస్తూ.. ‘థాయ్‌లాండ్‌ సమాజంలో లింగ భిన్నత్వంపై అవగాహన పెంపొందించేందుకు, జాతి, మతాలకు అతీతంగా అందరినీ ఆలింగనం చేసుకునేందుకు ఈ వివాహ సమానత్వ చట్టం నాంది. ప్రతి ఒక్కరూ సమాన హక్కులు, గౌరవానికి అర్హులు. ఇదొక చారిత్రక మైలురాయి’ అని తెలిపారు. అందరి ప్రయత్నాల వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. కాగా, ప్రస్తుతం ప్రపంచంలోని 33 దేశాల్లో గే వివాహాలు చట్టబద్ధంగా ఆమోదించబడ్డాయి. స్వలింగ సంపర్కుల వివాహాన్ని ఆమోదించిన మొదటి దేశంగా నెదర్లాండ్స్ అవతరించిన విషయం తెలసిందే.

Next Story