Pahalgam: సైనిక దుస్తులు ధరిస్తున్న ఉగ్రవాదులు.. గందరగోళంలో ప్రజలు

by Shamantha N |

జమ్ముకశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో గందరగోళానికి గురవుతున్నారు.

Pahalgam: సైనిక దుస్తులు ధరిస్తున్న ఉగ్రవాదులు.. గందరగోళంలో ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో గందరగోళానికి గురవుతున్నారు. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయపడుతున్నారు. అంతేకాకుండా భద్రతా సిబ్బందికి కూడా ముప్పును పసిగట్టడంలో ఇబ్బంది ఎదురవుతోంది. కాగా.. ఉగ్రవాదులు సైనిక యూనిఫామ్‌ను ధరించడం భద్రతాపరంగా తీవ్ర ఆందోళనకరమైన అంశంగా మారుతోంది. కొన్నిసార్లు వేగంగా ఆపరేషన్లు చేస్తున్న సమయంలో ఈ పరిణామాలు గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ‘‘ఈ ప్లాన్ కేవలం మోసం మాత్రమే కాదు.. ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. భద్రతా బలగాలు, స్థానిక పౌరుల మధ్య నమ్మకాన్ని దెబ్బతీసేందుకు వేసే కుట్రలు ఇవి’’ అని సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దీని గురించి ఉన్నతస్థాయి సమావేశాల్లో చర్చించినట్లు అధికారులు తెలిపారు. పహెల్గాం దాడి తర్వాత సైనిక యూనిఫామ్‌లను పోలిన దుస్తులను విక్రయించకూడదని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు తీసుకొచ్చింది.

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత

ఏప్రిల్‌ 22న పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ముష్కరుల దాడుల్లో 26 మంది అమాయకులు చనిపోయారు. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు సైనిక దుస్తుల్లో వచ్చారని, వారు ఉగ్రవాదులను తెలుసుకోలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. అయితే, ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక యూనిఫామ్‌లో కన్పించినట్లు సమాచారం. అంతేకాకుండా, పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు జైషే ముష్కరులు చనిపోయారు. ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌, అమీర్‌ నజీన్‌ వనీ, యావర్‌ అహ్మద్‌ భట్‌ను బలగాలు మట్టుబెట్టాయి. వీరి మృతదేహాలను పరిశీలించగా.. వారు ధరించినవి అచ్చం సైనిక దుస్తుల్లాగే ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా జాకెట్‌, వారు ఉపయోగించిన పరికరాలు భద్రతా సిబ్బంది వినియోగించేవి గానే ఉన్నాయి. దీంతో భద్రతా బలగాలు వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నాయి.

Next Story