- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Terrorist: ఉగ్ర స్థావరాలపై ఉక్కుపాదం.. భద్రతా బలగాల ఆపరేషన్ ముమ్మరం
ఉగ్రదాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లో భారత బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. కశ్మీర్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రదాడి అనంతరం జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో భారత బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. కశ్మీర్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. టెర్రర్ అటాక్ నిందితులను పట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని ముష్టకాబాద్ సెడోరి నాలా అటవీ ప్రాంతంలో ఇంటలిజెన్స్ సమాచారం మేరకు భారత భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఉగ్ర స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఘటనా ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లక్ష్యంతో ఉగ్రవాదులు కార్యకలాపాలకు సిద్ధమవుతున్నారని, దీనిని పట్టుకోవడం భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయమని తెలిపారు. భద్రతా దళాల సకాలంలో చర్య తీసుకోవడం వల్ల పౌరుల ప్రాణాలకు, ప్రజా భద్రతకు ముప్పు తప్పిందని వెల్లడించారు.
టెర్రరిస్టుల ఇళ్లు ధ్వంసం
జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా ఐదుగురు ముష్కరుల నివాసాలను భద్రతా బలగాలు పేల్చేశాయి. షోపియన్, కుల్గామ్, పుల్వామా జిల్లాల్లో ఈ చర్యలకు పాల్పడ్డాయి. షోపియాన్‌లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని పేల్చేశాయి. అలాగే కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని, ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్, హరిస్ అహ్మద్ ఇళ్లను కూల్చేశారు. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో పేల్చారు. అంతకు ముందు పెహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లు ఇప్పటికే నేలమట్టమయ్యాయి. దీంతో రెండు రోజుల్లోనే 8 మంది ఉగ్రవాదుల ఇండ్లను ధ్వంసం చేశారు. అనంత్ నాగ్‌లో పోలీసులు 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మోడీకి ఇరాన్ అధ్యక్షుడి ఫోన్
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధాని మోడీతో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలను సమర్థించబోమని స్పష్టం చేశారు. బాధితులకు తన సంతాపాన్ని తెలియజేశారు. మానవత్వాన్ని విశ్వసించే వారందరూ ఉగ్రవాదంపై పోరాటంలో కలిసి నిలబడాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ భారత్ తో ఉందనే సందేశాన్ని పెజిష్కియాన్ ఇచ్చినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు పహెల్గామ్ ఉగ్ర దాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఖండించింది.






