మెఖ్లీగంజ్‌లో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించిన గ్రామస్థులు.. అడ్డుకున్న బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్

by Ajay Maddhiboyina |

మెఖ్లిగంజ్‌లో నిర్మించేది శాశ్వత ఫెన్సింగ్ కాదని.. ఇది లైన్ జీరోకు దగ్గరగా ఉండటం వల్ల టెంపరరీ ఫెన్సింగ్ నిర్మించామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు.

మెఖ్లీగంజ్‌లో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించిన గ్రామస్థులు.. అడ్డుకున్న బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్
X

దిశ, నేషనల్ బ్యూరో:

పశ్చిమ బెంగాల్‌లోని ఇండో-బంగ్లా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా సరిహద్దులోని గ్రామస్థులు కొన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేయడాని ప్రయత్నిస్తున్నారు. గతంలో మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ ప్రాంతంలో ఫెన్సింగ్ వేస్తుండగా ఆపేశారు. అయితే తాజాగా కూచ్ బెహర్ జిల్లాలోని మెఖ్లిగంజ్ ప్రాంతంలో కూడా ఇలాంటి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కొంత మంది గ్రామస్థులు మెఖ్లిగంజ్ ప్రాంతంలో శుక్రవారం ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టారు. దహగ్రామ్-అంగార్‌పొటా ప్రాంతంలోని బంగ్లాదేశ్ ఎన్‌క్లేవ్‌లో ఈ పనులు చేస్తుండగా సాయుధులైన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) పారామిలటరీ సభ్యులు అడ్డుకున్నారు. అయితే గ్రామస్థులు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయంతో నాలుగు అడుగుల ఫెన్సింగ్‌ను పూర్తి చేశారు.

ఇండియాలోకి చొచ్చుకొని వచ్చినట్లు ఉండే దహగ్రామ్-అంగార్‌పొటా ఎన్‌క్లేవ్‌ను టిన్ బిఘా అనే ఇరుకైన కారిడార్ బంగ్లాదేశ్ మెయిన్ ల్యాండ్‌ను కలుపుతుంది. ఈ కారిడార్ 178 వెడల్పు మాత్రమే ఉండగా.. ఇందులో 85 మీటర్ల రోడ్డు ఉంది. ఎలాంటి ఫెన్సింగ్ లేకుండానే ఉండే ఈ ప్రాంతంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు భారీగా మోహరించి ఉంటారు. అయితే.. పొరుగు దేశానికి చెందిన పశువులు తమ ప్రాంతంలోని పొలాల్లోకి ప్రవేశిస్తున్నాయని.. అందుకే బీఎస్ఎఫ్ సహాయంతో ఫెన్సింగ్ నిర్మించాలని భావించామని చెబుతున్నారు. అయితే గ్రామస్తులను పొరుగు దేశం పారామిలటరీ సిబ్బంది అడ్డుకోవడంతో బీఎస్ఎఫ్ అక్కడకు హుటాహుటిన చేరుకొని.. బీజీబీతో చర్చలు జరిపారు.

మెఖ్లిగంజ్‌లో నిర్మించేది శాశ్వత ఫెన్సింగ్ కాదని.. ఇది లైన్ జీరోకు దగ్గరగా ఉండటం వల్ల టెంపరరీ ఫెన్సింగ్ నిర్మించామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. శాశ్వత ఫెన్సింగ్ నిర్మించాలంటే సరిహద్దు నుంచి 150 గజాల దూరంలో నిర్మించాలి. కానీ ఇక్కడ అంత స్థలం లేదని.. బోర్డర్‌కు గ్రామం చాలా దగ్గరగా ఉందని.. అందుకే టెంపరరీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. గ్రామస్తులు నాలుగు అడుగులు ఎత్తున్న తాత్కాలిక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటుంటే.. కొంత మంది కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని బీఎస్ఎఫ్ అంటోంది. ఇరు దేశాల భూభాగాల విషయంలో ఎలాంటి మార్పు లేదని, త్వరలోనే తాత్కాలిక ఫెన్సింగ్ పూర్తవుతుందని బీఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Next Story