టెన్నిస్‌ క్రీడాకారిణి హత్య.. ముందే చనిపోవాలనుకున్న తండ్రి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-12 05:00:57  IST  )

హర్యానాకు (Haryana) చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ (Tennis Star Radhika Yadav) హత్య కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టెన్నిస్‌ క్రీడాకారిణి హత్య.. ముందే చనిపోవాలనుకున్న తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానాకు (Haryana) చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ (Tennis Star Radhika Yadav) హత్య కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన రాధిక తండ్రి దీపక్ యాదవ్.. ఈ దారుణానికి ముందు తనపై వచ్చిన సామాజిక ఒత్తిడి, కుటుంబపరమైన సమస్యలు మానసికంగా ఎంతగానో ప్రభావం చూపినట్టు వెల్లడించాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నట్లు పోలీసులకు తెలిపాడు.

దీపక్‌ కొన్ని రోజుల క్రితం వజీరాబాద్‌లోని తన స్వగ్రామం వెళ్లగా.. గ్రామస్థులు కొంతమంది అతడిపై తీవ్ర విమర్శలు చేసినట్లు చెప్పాడు. కుమార్తె ఆదాయంతో జీవిస్తున్నాడంటూ ఎగతాళి చేశారని, రాధికను కంట్రోల్‌లో పెట్టలేకపోతున్నావంటూ ఆయన్ను విమర్శించినట్లు తెలిపాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దీపక్ గ్రామం నుంచి తిరిగి వచ్చాక.. టెన్నిస్‌ అకాడమీని మూసివేయడంపై రాధికతో అనేకసార్లు మాట్లాడాడు. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. రూ.2 కోట్లు ఖర్చు చేసి నేర్చుకున్న కెరీర్‌ను వదులుకోమని చెప్పడం సమంజసం కాదని వాదించింది. రాధిక మాటలకు కలత చెందిన దీపక్‌ తన ప్రాణాలను తీసుకునేందుకు కూడా ప్రయత్నించాడు. ఆ తరువాత పరిస్థితులు మరింత దారుణంగా మారి, చివరకు రాధిక హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. హత్య జరిగిన రోజు కూడా ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలిపాడు.

కాగా, రాష్ట్రస్థాయి టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌(25) గురుగ్రామ్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటోంది. గురువారం (జులై 10) రాధిక ఇంట్లో వంట చేస్తుండగా.. తండ్రి వెనక నుంచి తుపాకీతో కాల్చడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నేరానికి ఒప్పుకున్న దీపక్‌ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. మొదట్లో ఈ ఘటనపై తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వారు దీన్ని ఖండిస్తున్నారు. దీపక్‌కు గురుగ్రామ్‌లో అనేక ఆస్తులు ఉన్నాయనీ, వాటినుంచి అద్దెలు కూడా వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story