- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేదార్‌నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ యాత్రలకు తాత్కాలిక బ్రేక్
హిమాలయ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హిమాలయ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్, హేమకుండ్ సాహిబ్ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేసింది. వాతావరణ పరిస్థితులు, రహదారుల భద్రతపై పూర్తి స్థాయి అంచనా వేసిన తర్వాతే యాత్రికులను ముందుకు అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
నిలిచిపోయిన వాహనాలు..
రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల బద్రీనాథ్, కేదార్‌నాథ్, హేమకుండ్ సాహిబ్ వెళ్లే యాత్రికుల వాహనాలను అధికారులు శ్రీనగర్ (గర్వాల్) వద్దనే నిలిపివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, అధికారుల సూచనలను యాత్రికులు తప్పక పాటించాలని, పరిస్థితులు చక్కబడే వరకు సంయమనం పాటించాలని యంత్రాంగం కోరింది.
యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీనగర్ (గర్వాల్) ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ దీపక్ భండారీ మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణం వల్లే యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను ఆయన వివరించారు. శ్రీనగర్‌లోని ఎన్ఐటీ (NIT) గ్రౌండ్, ఆవాస్ వికాస్ గ్రౌండ్‌లలో యాత్రికులకు బస ఏర్పాటు చేశారు. ఇప్పటికే 100 చిన్న వాహనాలు, సుమారు 35 వరకు పెద్ద వాహనాలను ఇక్కడ పార్క్ చేశారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలతో పాటు ఆహార ప్యాకెట్లను కూడా అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు.






