టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. ఢిల్లీ హైకోర్టులో కేంద్రం సంచలన అఫిడవిట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-18 10:50:48  IST  )

టెలిగ్రామ్ కేవలం ఒక మెసేజింగ్ యాప్‌గా కాకుండా, డార్క్ వెబ్ ఫోరమ్‌లకు లింక్ చేసే ఓ ప్రమాదకరమైన నెట్‌వర్క్‌లా మారిందని కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.

టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. ఢిల్లీ హైకోర్టులో కేంద్రం సంచలన అఫిడవిట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులకు సురక్షితమైన స్థావరం (Safe Haven)గా మారిందని, ఇది దేశంలో కొత్త డార్క్ వెబ్‌ (New Dark Web) రూపం దాల్చిందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన ఓ అఫిడవిట్‌లో సంచలన ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్‌లో నేరాల నియంత్రణపై దాఖలైన ఓ పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం వివరాలను కోర్టు ఎదుట పెట్టింది.

నీట్ పేపర్ల లీక్.. పరీక్షల అక్రమాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) వంటి కీలకమైన పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్లు లీక్ కావడానికి, వాటిని అక్రమంగా సర్క్యులేట్ చేయడానికి టెలిగ్రామ్ ఛానెళ్లను విచ్చలవిడిగా ఉపయోగించారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా అంతర్జాతీయ హ్యాకర్ గ్రూపులు సైబర్ దాడులను కో-ఆర్డినేట్ చేసుకోవడానికి, డేటాను మాయం చేయడానికి టెలిగ్రామ్‌ను వాడుతున్నారని పేర్కొన్నారు. దొంగిలించిన డేటాను పంచుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు. టెలిగ్రామ్ గ్రూపులు, క్లోజ్డ్ ఛానెళ్ల ద్వారా పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (Child Sexual Abuse Material), చైల్డ్ పోర్నోగ్రఫీ విపరీతంగా సర్క్యులేట్ అవుతోందని కేంద్ర ఢిల్లీకి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

చట్టాల నుంచి తప్పించుకునే ఫీచర్లు..

టెలిగ్రామ్‌లో మితిమీరిన ప్రైవసీ, ఇతర ఫీచర్ల వల్ల యూజర్లు తమ ఫోన్ నంబర్లు, ఐడీలను సులభంగా దాచుకోగలుగుతున్నారు. దీంతో నేరస్తుల అసలు గుర్తింపును, వారి ఐపీ అడ్రస్‌లను కనుగొనడం దర్యాప్తు సంస్థలు పోలీసులకు తలకు మించిన భారం అవుతోందని అన్నారు. చివరగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. టెలిగ్రామ్ ద్వారా జరిగే సైబర్ మోసాల ఫిర్యాదులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. మనీలాండరింగ్ కోసం ఉపయోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాల (Mule Bank Accounts) విక్రయాలు కూడా ఓపెన్‌గా కొనసాగుతున్నాయని కేంద్రం చెప్పింది. టెలిగ్రామ్ కేవలం ఓ సాధారణ మెసేజింగ్ యాప్‌గా కాదని, డార్క్ వెబ్ ఫోరమ్‌లకు లింక్ చేసే డెంజరస్ నెట్‌వర్క్‌ మారిందని, ఇది దేశ భద్రతకు, పౌరుల ప్రైవసీకి పెద్ద ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. తీజా పరిణామలతో నేపథ్యంలో కోర్టు టెలిగ్రామ్ యాప్‌పై నిషేధం విధిస్తుందా.. లేక గైడ్‌లైన్స్ సూచిస్తుందా అనేది సస్పెన్స్‌లా మారింది.

Next Story