- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రీ కరెంట్, ఇంటికో ఉద్యోగం.. తేజస్వీ ఎన్నికల హామీల వరాలు
బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్ ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రాణ్’ పేరుతో మ్యానిఫెస్టోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తదితరుల సమక్షంలో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర హామీలు ఇచ్చారు. బిహార్‌ను అభివృద్ధిపథంలో నడిపించి దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తేజస్వీ యాదవ్ వెల్లడించారు.
అంతకుముందు పార్సా, సారణ్ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్న తేజస్వి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని, ఇంటికే నేరుగా సరఫరా అవుతోందని ఆరోపించారు. విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి, సాగునీటిని అందించే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని.. గత ఇరవై ఏళ్లలో ఎన్డీయే కూటమి వీటిని చేపట్టలేకపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామన్నారు. సారణ్‌లో హత్యలు, దోపిడీ, అపహరణలు కామన్ అయ్యాయని, సీఎం నీతీశ్ కుమార్ బాధితులను ఒక్కసారి కూడా పరామర్శించలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
విపక్ష కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్యోగాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతున్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కాగా 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నవంబర్ 6 తొలిదశ, నవంబర్ 11న రెండోదశలో పోలింగ్ జరగనుంది.






